కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం సత్యదేవుడు

అన్నవరం ‘శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి‘ దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉంది.


ఈ దేవాలయంలో సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి పాదాలు దర్శించుకొని, పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి, మహేశ్వరుడు,అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు.


ఈ దేవాలయంలో సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సంప్రదాయ. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజూ సత్యదేవ వ్రతాలు, నిత్య కల్యాణాలు జరుగుతుంటాయి.

స్థల పురాణం : –  గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి  1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున రత్నగిరి పర్వతంపై ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తర్వత గ్రామపెద్దలతా  కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.

దర్శన వేళలు:-
ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే.
రోజూ స్వామివారికి మహానివేదన కోసం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.00 గంట పాటు దర్శనాలు ఆపేస్తారు అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.
ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు
* ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.
* సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి.
* వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.

వసతి, భోజన సౌకర్యం వివరాలు: కొండపైన, అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు… సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

ఆన్‌లైన్‌ సేవలు: దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు… ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు.

రవాణా సౌకర్యం: కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.