మధ్యప్రదేశ్‌లోని ఝబువా గిరిజన ప్రాబల్య జిల్లా. ఇక్కడ తక్కువ వర్షాపాతం నమోదవుతుండడంతో రైతులు వ్యవసాయానికి సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు చెందిన రమేశ్ బరియా అనే రైతు అందుబాటులో వాటిని సద్వినియోగం చేసుకుంటూ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు.
తక్కువ నీటితో శీతాకాలం, వర్షాకాలంలో కూరగాయల సాగును ప్రారంభించాడు. తర్వాత కాకర, పొట్లకాయ సాగు చేపట్టారు. మరిన్ని లాభాలు పెంచుకునేందుకు చిన్న నర్సరీని ఏర్పాటు చేశాడు. అయితే రుతుపవనాలు ఆలస్యం కావడంతో నీటికి తీవ్రమైన కొరత ఏర్పడింది.
వ్యర్థ గ్లూకోజ్ బాటిళ్ల సహాయంతో పంటలకు బిందుసేద్యం తరహాలో వాడుకోవాలని ఆలోచనతో పాస్టిక్ గ్లూకోజ్ డబ్బాలను కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేశాడు. కింది భాగం కొంత కట్ చేసి, దానికి మరో ప్లాస్టిక్ డబ్బాను జత చేసి, సెలైన్ పైప్ ద్వారా కిందికి నీరు వెళ్లేలా ఏర్పాటు చేశాడు. ఈ సీసాలను కర్రకు వేలాడదీసి, ఐవీ రెగ్యులరేటర్ సహాయంతో నీళ్లు చుక్క చుక్కగా పడేలా డ్రిప్ సిస్టమ్ తరహాలో తీర్చిదిద్దాడు. ఉదయం, సాయంత్రం తన పిల్లలకు వాటిని నింపే పనిని అప్పగించాడు. సీజన్ ముగింపులో అతను 0.1 హెక్టార్ భూమి నుంచి రూ.15వేలకుపైగా లాభాన్ని ఆర్జించాడు. సరికొత్తగా నీటి పారుదల విధానాన్ని అవలంభించినందుకు రమేశ్ బరియాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రశంసాపత్రంతో అభినందించింది.