సూర్య, సమంతల ‘24’ ఆడియో విడుదల
సూర్య హీరోగా ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24′. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో వస్తోన్న ‘24’ చిత్రానికి సంబంధించిన పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. సమంత, నిత్య మేనన్ కథానాయికలు. తొలిసీడీని ప్రముఖ కథానాయకుడు కార్తి ఆవిష్కరించారు. సురేష్‌బాబు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ అందుకొన్నారు. ప్రచార చిత్రాన్ని అఖిల్ విడుదల చేశారు.
సమంత:- ‘‘నా తొలి సినిమాకే తన పాటలతో నాకు జీవితాన్నిచ్చారు రెహమాన్. ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. తన పాటలతో ఈ సినిమానీ ఎక్కడికో తీసుకెళ్లారు. విక్రమ్ గారు ఈ కథ చెప్పినప్పుడు భయపడ్డా. ఇలాంటి సినిమా తీయగలుగుతారా? అనిపించింది. కానీ చెప్పిన దానికంటే బాగా తీశారు. సూర్య మూడు పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా ఆయన మాత్రమే చేయగలరు’’ .
రెహమాన్:- ‘‘ఈ అవకాశం ఇచ్చిన సూర్య, విక్రమ్‌లకు కృతజ్ఞతలు. మా అబ్బాయి అమీన్ తన తొలి పాట అరబిక్‌లో పాడాడు. ఆ తరవాత ఈ సినిమా కోసం పాడాడు. తనకు మీ ఆశీస్సులు కావాలి. ఈ సినిమా బాగా ఆడాలని దేవుణ్ని కోరుకొంటున్నా’’ అన్నారు.
సూర్య:- ‘‘నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రమిది. ‘మనం’ తరవాత విక్రమ్ నా దగ్గరకు వచ్చారు. నాలుగున్నర గంటల పాటు కథ చెప్పారు. ఆ సమయంలో కనురెప్పలు మూయడం కూడా మర్చిపోయా. కథ పూర్తవగానే లేచి చప్పట్లు కొట్టా. అంత బాగా నచ్చింది. ఇలాంటి సినిమాతో నేనే నిర్మాతగా మారాలి అనుకొన్నా. అందుకే ఆ బాధ్యతలూ స్వీకరించా. వెంటనే రెహమాన్‌గారి తలుపు తట్టాం. ఆ సమయంలో ఆయన రంజాన్ ఉపవాసాలు ఉంటున్నారు. అయినా సరే మా కథ విని ‘ఈ సినిమా నేను చేస్తున్నా’ అన్నారు. దాంతో మరింత ఉత్సాహం వచ్చింది. నాకిప్పుడు ఓ మంచి విజయం కావాలి. చాలా ప్రశ్నలకు ఈ సినిమా ఓ సమాధానంగా నిలుస్తుంద’’న్నారు.