విద్యావ్యవస్థ బలోపేతంపై దృష్టి పెడతాం: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి, అమలు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో వివిధ రకాల విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని నిర్ణయించారు. దీనికోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగు పరిచి, అత్యుత్తమ విద్యాబోధన జరిగేలా చేయడం ద్వారానే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందని సిఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై త్వరలోనే ఓ వర్క్ షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్.

  • డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి.
  • మిగతా వారిని పై తరగతులకు ప్రస్తుతానికి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా ప్రమోట్ చేయాలి.
  • ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలి.
  • విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం రూపొందిస్తుంది.

రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి అనే విషయాలపై కేంద్ర మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది.