సోమనాథక్షేత్రం గుజరాత్‌(సౌరాష్ట్రే)

పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమస్థానంలో వున్న సోమనాథక్షేత్రం గుజరాత్‌లో వుంది. 

సోమనాథక్షేత్రం అనేక దండయాత్రలకు గురైనప్పటికీ తిరిగి పునర్‌ నిర్మితమైన క్షేత్రమది. సిరిసంపదలతో వున్న ఈ క్షేత్రంపైకి అనేక మంది విదేశీపాలకులు దండయాత్రలు చేశారు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన క్షేత్రం కాబట్టే సోమనాథక్షేత్రంగా పేరొందింది.

దక్షప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికిచ్చి వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా వున్నాడని మిగిలిన భార్యలు తమ తండ్రైన దక్షప్రజాపతికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఆయన చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని శాపమిచ్చాడు. దీంతో భూలోకంపై వచ్చిన చంద్రుడు ప్రస్తుత క్షేత్రమున్న ప్రాంతంలో శివ విగ్రహాన్ని ప్రతిష్టించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగించాడు. 27 సతీమణులను సరిసమానంగా చూసుకోవాలని చంద్రునికి హితవు పలికాడు. చంద్రునికి శాపవిముక్తి జరిగిన ప్రదేశం కాబట్టి సోమనాథక్షేత్రంగా పేరొచ్చింది.

Lord-Shiva-somanadh-freshga
చంద్రుడికి ఈ క్షేత్రంలో శాపవిముక్తి కలిగింది. దీంతో ఆయన పరమానందభరితుడై బంగారంతో ఆలయం నిర్మించినట్టు తెలుస్తోంది. అనంతరం రావణాసురుడు వెండితో ఆలయాన్ని నిర్మించగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చందనపు చెక్కలతో నూతన ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

సోమనాథక్షేత్రంలో భారీ సంపద వుండటంతో అనేకసార్లు దండయాత్రలకు గురైంది. క్రీ.శ. 1024లో గజనీ పాలకుడైన మహమ్మద్‌ చేసిన దండయాత్రలో ఆలయం తీవ్ర నష్టానికి గురైంది. ఆ సమయంలోనే ఆలయంనుంచి ఎక్కువ సంపదను గజనీకి తరలించినట్టు చారిత్రక గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. అనంతరం స్థానిక పాలకులు తిరిగి నిర్మించారు. దిల్లీ పాలకుడైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ పాలనలోనూ ఆలయంపై దాడులు జరిగాయి. భారతదేశ ప్రథమ హోంమంత్రి వల్లభాయ్‌పటేల్‌ ఆలయాన్ని సందర్శించి పునర్‌ నిర్మాణానికి ఆదేశాలిచ్చారు. 1951లో నూతన ఆలయ నిర్మాణం పూర్తయింది. భారత దేశ రాష్ట్రపతి బాబురాజేంద్రప్రసాద్‌ ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయాన్ని తిరిగి నిర్మించేందుకు నిధుల సేకరణ చేయకుండా కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించడం విశేషం. యుగయుగాలుగా భక్తుల కోసం కొలువైవున్న సోమనాథమూర్తి తన దివ్యశక్తితో అందరిని ఆశీర్వదిస్తుంటారు.

ఆలయ సమీపంలోని ఇతర మందిరాలు
క్రీ.శ. 1782లో మహాభక్తురాలైన అహల్యాబాయ్‌ హోల్కర్‌ మరో ఆలయాన్ని సమీపంలో నిర్మించింది. క్షేత్రంలో నిరాటంకంగా పూజలు చేసుందుకు ఆలయాన్ని నిర్మించారు. శ్రీకపర్థి వినాయక మందిరం, హనుమాన్‌ మందిరాలను వీక్షించవచ్చు. అరేబియా సముద్రం సమీపంలోనే వుండటంతో సూర్యాస్తమయాన్ని వీక్షించేందుకు వల్లబ్‌ఘాట్‌ అనే ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఘాట్‌ నుంచి సూర్యాస్తమయం చూడటం భక్తులకు చిరస్మరణీయ అనుభూతిని కలిగిస్తుంది.

ఎలా చేరుకోవాలి
* గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌కు ఆలయం 412 కి.మీ. దూరంలో వుంది.
* డయ్యు విమానాశ్రయంనుంచి 90 కి.మీ.దూరం. అక్కడ నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా సోమనాథ్‌ చేరుకోవచ్చు.
* సమీప రైల్వేస్టేషన్‌ వెరవెల్‌ 5 కి.మీ.దూరంలో వుంది.