సోమేపల్లి సోమయ్య గారి జీవితం.. స్ఫూర్తి, శాశ్వతం…

మేరుశిఖరం, త్యాగమూర్తి, తపోనిష్ఠ, ధన్యజీవి శ్రీ సోమేపల్లి సోమయ్యగారు 1927వ సంవత్సరంలో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి దగ్గరి పల్లామిల్లి గ్రామంలో జన్మించాడు. పేద కుటుంబం. సోమయ్య గారి చిన్న తనంలో వారి కుటుంబం బ్రతుకుదెరువు కోసం తెనాలి వచ్చి స్థిరపడింది. సోమయ్యగారికి 9 సంవత్సరాలున్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లి కట్టెల అడితి నడుపుకొంటూ కుమారుడిని చదివిస్తుండే వారు. సోమయ్యగారు ఫిఫ్త్‌ఫారం (ఇప్పటి 10వ తరగతి)లో ఉన్నారు. తనకు మంచి మార్కులు వస్తుండేవి ముఖ్యంగా గణితంలో క్లాసులో టాపర్‌గా ఉండేవారట. రామానుజం అనే తోటి విద్యార్థి ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయం జరిగింది.

గుంటూరులో ఇంటర్మీడియేట్‌ ‌చదువుతున్నప్పుడు, బ్రాడీపేటలో వారు వెళ్లిన శాఖకునాడు వచ్చిన విద్యార్థుల్లో ఇద్దరు అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌ముఖ్య మంత్రులైనారు. ఒకరు భవనం వెంకట్రామ్‌, ‌మరొకరు యన్‌.‌టి.రామారావు. సుప్రసిద్ధ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కూడా ఆ శాఖకు వస్తుండేవారట. ఆ తర్వాత కాలంలో 1970వ దశకంలో సూర్యాపేట వాస్తవ్యులు, నల్లగొండ జిల్లా సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌పుల్లయ్యగారు కొత్తగా నిర్మించిన హాస్పిటల్‌ ‌ప్రారంభోత్సవానికి రామారావుగారు వచ్చిన సందర్భంలో మళ్లీ యన్‌.‌టి.ఆర్‌ను కలవడం జరిగింది. ‘‘దత్తాత్రేయ దండోపంత్‌ ‌బందిష్టే’’ఎలా ఉన్నారని రామారావుగారు వాకబు చేశారట. వారు చదువుకొనే రోజుల్లో గుంటూరులో బందిష్టేగారు ప్రచారక్‌.

సంఘంపై నిషేధాన్ని జూలై 1949లో తొలగించిన తర్వాత, 1950 వేసవిలో అవిభక్త మద్రాసు రాష్ట్ర సంఘ శిక్షావర్గ నెల్లూరులో జరిగింది. ఆంధ్రలో జరిగిన మొదటి ఒటిసి అది. ఒటిసి వి.ఆర్‌. ‌కాలేజీలో జరిగింది. మాననీయ శ్రీ గురూజీ మూడురోజులున్నారు. ఆ ఒటిసిలో సోమయ్యగారు శిక్షక్‌. ఒటిసి తర్వాత నెల్లూరు నగర ప్రచారక్‌గా ఉండిపోయారు. అప్పుడు వారి వయసు 22-23.అప్పటి నుంచి 1995లో వారు తుదిశ్వాస విడిచేవరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తో అనుబంధం కొనసాగింది.

రాయలసీమ క్షామం:
1951లో రాయలసీమ, నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి రాపూరులలో భీకర క్షామం ఏర్పడింది. ఆ ప్రాంతంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సహాయ కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరు జిల్లా డెల్టా ప్రాంతంలోని స్వయంసేవకులు సోమయ్యగారి నేతృత్వంలో చిత్తూరు జిల్లాలో, నెల్లూరు మెట్ట ప్రాంతాలలో గంజి కేంద్రాలు నిర్వహించారు.

గంజి కేంద్రాలకు పంపేందుకు డెల్టా ప్రాంతంలో స్వయంసేవకులు బియ్యం, వడ్లూ సేకరించేవారు. నెల్లూరు శాఖకు చెందిన ‘శిశుగణ’ స్వయంసేవకులు చందాల కోసం ట్రంకు రోడ్డు మీద క్రమశిక్షణతో పాటలు పాడుతూ నడుస్తున్నప్పుడు ఎందరి కళ్లో చెమర్చాయి. అంత శ్రమించి స్వయంసేవకులు చిత్తూరు జిల్లాకు బియ్యం పంపడానికి సిద్ధం చేస్తే, నెల్లూరు తాసిల్దార్‌ అన్నదాత మార్కండేయులు పర్మిట్‌ ఇవ్వకుండా జాప్యం చేశాడు. ప్రజలు ప్రాణాలు నిలబెట్టడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌పూనుకుంటే అది కూడా జరగనియ్యకుండా అధికార యంత్రాంగం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని మెప్పించడానికి చేసిన అమానవీయ చర్య అది. సోమయ్యగారికి ఆగ్రహం వచ్చింది. తాలూకాఫీసుకు వెళ్లి మార్కండేయులను దులిపేశారు. అదే రోజు పర్మిట్‌ ‌వచ్చింది.

అవనిగడ్డలో ఆంధప్రదేశ్‌ ‌తుపాను బాధితుల సహాయ సమితి కార్యదర్శి ఆర్‌. ‌నాగరాజ్‌ను సోమయ్య గారు ప్రముఖ సర్వోదయ నాయకులు గోపరాజు లవణం గారికి పరిచయం చేస్తున్నప్పటి ఫొటో. పక్కన జి. పుల్లారెడ్డి, హేమలత లవణం, బండారు దత్తాత్రేయ, జిఎస్‌కె ఆచార్య, వేదాంతం సంగమేశ్వరశాస్త్రి, డా।। వడ్డి విజయసారథి.

1952లో సోమయ్యగారు నెల్లూరు జిల్లా ప్రచారక్‌ అయినారు. క్రమంగా సోమయ్యగారు కార్యకర్తలను తీర్చిదిద్దే శైలితో ఫలితాలు కనిపించటం ప్రారంభ మైంది. 1957లో సోమయ్యగారి క్షేత్రాన్ని విస్తరించారు. నెల్లూరుతో పాటు గుంటూరు కూడా అప్పగించారు. వారి సంపర్కంలోకి వచ్చిన యువకుల్లో భవిష్యత్తులో కార్యకర్తలుగా ఎదుగగలిగిన వారిని ముందుగానే గుర్తించి, స్నేహ మాధుర్యంతో వారిపై చెరగని ముద్రవేశారు. అవిభక్త ఆంధప్రదేశ్‌లో సంఘవ్యాప్తికి నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన వారి కృషి గణనీయంగా ఉందంటే కారణం సోమయ్యగారు. వారిలో మన “ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు” గారు కూడా ఉన్నారు. వ్యక్తిగత సంభాషణల్లో, పలకరింపుల్లో సౌమ్యత, సహజత్వం ఒలుకుతుండేది. తద్వారా వారిపై ఎనలేని గౌరవం ఏర్పడేది. ఇండ్లకు వచ్చినప్పుడు వారు వ్యవహరించే తీరు, పాటించే మర్యాద, కుటుంబాల్లో వారికి అభిమానాన్ని సంతరించి పెట్టాయి.

ప్రాంత ప్రచారక్ గా బాధ్యతలు:
1959 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో సోమయ్యగారిని ప్రాంత ప్రచారక్‌గా ప్రకటించారు. ప్రాంతప్రచారక్‌గా సోమయ్యగారి ముందుకొచ్చిన మరొక సమస్య తెలంగాణలో సంఘ విస్తరణ. పోలీసు చర్య తర్వాతే పాత హైదరాబాదు సంస్థానంలో శాఖలు ప్రారంభమైన్నాయి. కోస్తా జిల్లాలనుంచి చాలామంది ప్రచారకులను వారు తెలంగాణాకు జిల్లా ప్రచారకులుగా పంపారు. మెదక్‌కు భాన్‌సింగ్‌, ‌మహబూబ్‌నగర్‌కు పి.సి. రమణయ్య, నల్లగొండకు మొదట నందిగాం రామ్మూర్తి, తర్వాత ఇ.సి. రామ్మూర్తి ఆవిధంగా పంపించిన వారిలో కొందరు. ప్రచారకులు కాని కొందరు కార్యకర్తలను కూడా తెలంగాణాకు వెళ్లి స్థిరపడవలసిందిగా ప్రోత్స హించారు.

ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కమ్యూనిస్టుల కంచుకోటలుగా ఉండేవి. శాఖలు ప్రారంభించడం ఎంతో కష్టంగా ఉండేది. కమ్యూనిస్టు గుండాలు స్వయంసేవకులపై భౌతిక దాడులు జరిపేవారు. కాంగ్రెసు ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరించేది. అలాంటి భౌతిక దాడి సోమయ్య గారిపై కూడా జరిగింది. నల్లగొండ జిల్లా తిరుమల గిరిలో శాఖ ప్రారంభమైంది. స్వయంసేవకుల సంఖ్య వృద్ధి చెందింది. 1963లో తొండగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి సోమయ్యగారు వెళ్లారు. సోమయ్యగారు వస్తున్నారని ముందే తెలుసుకున్న కమ్యూనిస్టులు ఒక జిల్లా స్థాయి నాయకుడి ఆధ్వర్యంలో శాఖపై కర్రలతో, ఇనుపరాడ్స్‌తో దాడిచేశారు. సంఘస్థాన్‌లో సోమయ్యగారు ఒక్కరే మిగిలిపోయారు. క్రిందపడిపోయారు. చేతులతో తలను కాపాడుకొంటున్నా విపరీతంగా కొట్టారు. చనిపోయాడని భావించి వదిలేసి వెళ్లిపోయారు. ఆ సందర్భంలో తను అనుభవించిన వేదనను గురించి సోమయ్యగారు ఎన్నడూ ఎక్కడా ప్రస్తావించలేదు. అలా ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొని తనదైన శైలిలో 30 సంవత్సరాలపాటు ప్రాంత ప్రచారక్‌గా అవిభక్త ఆంధప్రదేశ్‌లో సంఘ విస్తరణకు కృషిచేసి 1989 లో వారు ప్రాంత ప్రచారక్‌ ‌బాధ్యత నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ విధంగా తన జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి అంకితం చేశారు. వారి జీవితం ఎంతో మంది ప్రచారకులకు ఆదర్శం. గురు పౌర్ణమి సందర్భంగా మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సంఘ జ్యేష్ఠ కార్యకర్తలైన సోమేపల్లి సోమయ్య, భోగాది దుర్గా ప్రసాద్‌లను గురువులుగా భావిస్తానని తెలిపారు.

1995 జూలై 25 మద్రాసు నుంచి కేరళకు రైళ్లలో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు. జూలై 26 ఉదయం కేరళ పత్రికలు గుర్తు తెలియని వ్యక్తి శవం ఆల్వాయ్‌ ‌స్టేషన్‌ ‌ప్లాట్‌ఫారం మీద పడి ఉందని ఒక ఫోటో ప్రచురించాయి. అది సోమయ్యగారిదని గుర్తుపట్టిన స్వయంసేవకులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 27వ తేది రాత్రికి విమానంలో వారి పార్థివదేహం హైదరాబాద్‌కు చేరింది. అంబరుపేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.