దేవుడి దర్శనం తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలని చెప్పటం వెనుక రహస్యమిదే!!

దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత గుడి నుంచి బయటకు వచ్చే ముందు కొద్దిసేపు గుడి మండపం లోపల కానీ ప్రాకారం లోపల కానీ కూర్చుని వస్తూ ఉంటారు.

అసలు దేవుడి దర్శనం తర్వాత గుళ్లో ఎందుకు కూర్చోవాలి? దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దైవదర్శనం అయిన తర్వాత కొద్దిసేపు తప్పక కూర్చుంటాం. అలా ఎందుకు కూర్చుంటామో తెలియనప్పటికీ పెద్దలు చెప్పారు కాబట్టి నేటికీ దానిని ఆనవాయితీగా ఆచరిస్తున్నాం. అయితే కొంతమంది దైవ దర్శనం అయిన వెంటనే హడావుడిగా వెళ్ళి పోతూ ఉంటారు. అలా వెళ్లడం మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. దానికి అనేక కారణాలను కూడా వారు చెబుతున్నారు.

దేవుడి దర్శనం అయిన తరువాత గుడిలో కూర్చోవడానికి అనేక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ గుడికి వెళ్లిన వారిని శక్తివంతులుగానూ, మంచి ఆలోచనలు చేసే విధంగానూ తీర్చిదిద్దుతుంది. అంతేకాదు పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

గుడిలో దైవ దర్శనం అయిన తరువాత మనస్సు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. గుడిలో విద్యుదయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉండడం వల్ల మనకు కావలసినంత పాజిటివ్ ఎనర్జీ గుడిలో లభిస్తుంది. గుడిలో మూలవిరాట్ ను ప్రతిష్ట చేసే మూలస్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి.

మూల విరాట్ ను ప్రతిష్ట చేసేముందు భూమి లోపల మంత్రాలు రాసిన రాగిరేకులు ఉంచుతారు. ఈ రాగిరేకులు భూమిలో ఉండడం వల్ల మూలస్థానంలో కలిగే అయస్కాంత తరంగాల శక్తి రాగిరేకుల ద్వారా ప్రసారమవుతాయి. గుడికి వచ్చే భక్తులకు ఆ శక్తి లభించి శరీరం ఉత్తేజితమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ శక్తి కారణం అవుతుంది. కాబట్టి దేవాలయంలో దేవుని దర్శనం తర్వాత కాసేపు ఆలయంలో కూర్చుంటే జీవితంలో కావలసిన పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.