హోంవర్క్ చేస్తే టీవీ పెడతా, చెప్పినమాట వింటే టీవీ వేస్తా.. అంటూ ప్రతి ఇంటిలోనూ నిత్యం టెలివిజన్‌తో ముడిపెట్టి చిన్నారులను బుజ్జగించే పరిస్థితి మరింత తీవ్రమైపోయింది. అన్నం తినకుండా మారాం చేస్తుంటే టీవీలో కార్టూన్ పెట్టి తినిపిస్తారు. పనికి ఆటంకంగా ఉంటే టీవీ వేసి ఓచోట కట్టిపడేస్తారు. చిన్నారులు అల్లరి చేస్తే టీవీ ఆన్‌చేసి అదుపు చేస్తారు. దీంతో పదేళ్లు దాటేసరికి టీవీ లేని ప్రపంచాన్ని వూహించుకోలేనంతగా పిల్లలకు ఓ వ్యసనంగా మారిపోతోంది. ఇలా టీవీకి అతిగా అతుక్కుపోయే పిల్లలు జ్ఞాపకశక్తి కోల్పోవడం, కంటి, శారీరక సమస్యల బారినపడతారనే విషయం మాత్రమే ఇప్పటివరకూ తెలుసు. టీవీ, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లకు అతుక్కుపోయే పిల్లలు సమాజానికి సైతం దూరమైపోతున్నారని ఒంటరివారై పోతారని తాజాగా అధ్యయనంలో తేలింది.
అతిగా టీవీ చూసే పిల్లలు 13వ ఏట నుంచే మిగతా వారితో కలవలేకపోతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. టీవీ, స్మార్ట్‌ఫోన్లు పిల్లలకే కాదు పెద్దలకూ ఓ వ్యసనంగా మారిపోయాయిప్పుడు. భవిష్యత్తులో ఇది చిన్నారుల జీవితంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీవీకి అతుక్కుపోతున్న వారిలో ఒంటరితనం పెరిగిపోతున్న విషయాన్ని గమనించారు.
ఉద్యోగాలు వదిలేస్తూ…
విజయవాడలోని ఇగ్నో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు ఇటీవల ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులపై ఓ సర్వే చేశారు. తొలి కొలువు సాధించిన చాలామంది విద్యార్థులు మూడు నెలలు తిరక్కుండానే దానిని వదిలేస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. వీరు ఎక్కడున్నా.. ఒక్కరే టీవీ చూసుకోవడం, స్మార్ట్‌ఫోన్లతో ఆడుకోవడం వంటివి చేస్తూ అసలు ఎవరితోనూ కనీసం నోరు విప్పి మాట్లాడే పరిస్థితి ఉండడం లేదు. చదువు పూర్తిచేసుకుని బయటకు రాగానే.. వచ్చే కొలువుల్లో సర్దుకుపోవడం వీరికి సాధ్యం కావడం లేదు. సహోద్యోగులు, యాజమాన్యంతో ఏదో ఒక గొడవ పడడం, బయటకు వచ్చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అణకువ, సర్దుకుపోయే మనస్తత్వం, సమాజంలో ఇతరులతో కలిసి ముందుకెళ్లడం, బృందంలో పనిచేయడం వంటివి వీరిలో వీసమెత్తు కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తేలింది.
కాపురాలు కూలిపోతూ..
సమాజంలోని వేరొకరితో కలిసి వెళ్లే అలవాటుకు పూర్తిగా దూరమవుతున్న చాలామంది యువతరం వైవాహిక జీవనాన్ని సైతం ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నారు. అందుకే.. చాలావరకూ పెళ్లిల్లు సైతం అపహాస్యంగా మారిపోతున్నాయి. ఇతరులతో ఎలా మసలుకోవాలి, వారితో కలిసి జీవించాలంటే ఎలా ఉండాలనే చిన్నచిన్న విషయాలు సైతం చాలామందికి నేడు తెలియడం లేదు. కనీసం అవతలివారికి గౌరవం ఇవ్వాలి.. అదే మనం తీసుకోవాలనే చిన్న అలవాటును కూడా పాటించలేకపోతున్నారు. ఇది మంచి, ఇది చెడు.. ఇలా మసలుకోవాలి, ఇలా చేయకూడదు అని చెప్పేందుకూ తల్లిదండ్రులకు తీరిక ఉండకపోవడమే ప్రధాన కారణం.
ఆత్మహత్యకు పాల్పడుతూ..
ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటితరం విద్యార్థులలో ఎక్కువమంది సర్దుకునే మనస్తత్వం లేని వారేనని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా తమకంటూ మరికొందరు ఉన్నారనే భావనే చాలామందిని బతికిస్తుంది. తనకు ఎవరూ లేరు, తానొక్కడినే ఏదైనా చేయాలి, లేదంటే చావాలనే ధోరణి సైతం టీవీల ప్రభావం వల్లే వస్తోంది. చిన్న ఇబ్బంది వస్తే విలువైన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి పిల్లలను టీవీలు, స్మార్ట్‌ఫోన్ల బారినపడకుండా ఏదైనా శారీరక, మానసిక వ్యాయామాన్ని ఇచ్చే క్రీడలలో ప్రోత్సహించాలి. ఔనన్నా, కాదన్నా చాలా పాఠశాలలకు క్రీడా స్థలాలు లేవు. అందుకే ఇంటికి వచ్చాకైనా విద్యార్థులను స్వేచ్ఛగా తోటివారితో ఆడుకోనివ్వాలి. లేదంటే.. ఏదైనా మైదానానికి తీసుకెళ్లి చీకటి పడేవరకూ ఆడనివ్వాలి. ఇలా చేయడం వల్ల అలసిపోయి హాయిగా నిద్రపోతారు. ఓ ఆట ఆడనివ్వడమే.. వారి భవిష్యత్తుకు మీరిచ్చే అద్భుతమైన కానుక అనే విషయాన్ని గుర్తించాలి.
చిన్నారులను టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోయేలా చేస్తున్నది 90శాతం తల్లిదండ్రులే కావడం ఆందోళనకర పరిణామం. ప్రస్తుత గిజిబిజి జీవనంలో పిల్లలను ఎలా అదుపు చేయాలో కూడా తెలియక ఎక్కువ మంది ఇలా చేస్తున్నారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా పిల్లల మానసిక పరిస్థితిని బట్టి వారికి నిజమైన క్రీడలంటే చాలా ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని నేర్పించేవారు, ప్రత్యేకంగా తీసుకెళ్లి ఆడించేవారు, ప్రోత్సహించేవారు లేకపోవడంతో.. వారికి అందుబాటులో ఉండే వీడియో గేమ్స్, కార్టూన్ ఛానెళ్లకు ఆకర్షితులై బానిసలుగా మారిపోతున్నారు.
కోపం తారాస్థాయికి..
13ఏళ్ల తర్వాత వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల విద్యార్థుల్లో తెలియని ఆందోళన ఏర్పడుతుంది. ఈ సమయంలో వారిని సరైన మార్గంలో వెళ్లేలా చేయకపోతే భవిష్యత్తులో దుష్ఫలితాలు ఎదుర్కోక తప్పదు. చిన్నప్పటి నుంచి సరైన మార్గనిర్దేశనం చేయకపోవడం, క్రీడల్లో ప్రోత్సహించకపోవడంతో పోటీతత్వం అనేది అసలు లేకుండా పోతోంది. ఓటమిని జీర్ణించుకోలేని విధంగా మారిపోతున్నారు. వీరు ఏదైనా వీడియో గేమ్ ఆడుతుండగా వారి చేతిలోని స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను తల్లిదండ్రులు తీసుకుంటే ఒక్కసారిగా వారిలో కోపం అదుపు చేయలేనంతగా బయటపడుతోంది. ఆ ఫోన్‌ను తిరిగి లాక్కుని నేలకేసి విసిరికొట్టేంత కోపం ఎక్కువ మందిలో కన్పిస్తోంది. దీనిని ఆదిలోనే గుర్తించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యగా మరే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.