Review : ‘సహ’ (Sahaa – Life of Sanju)

శివకుమార్ కాసారం, శ్వేత లక్ష్మణ్ జంటగా నటించిన తాజా భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రం ‘సహ’ (Sahaa – Life of Sanju). నిశాంత్ దోటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తేజ వెల్పుచర్ల నిర్మాత. ప్రీ-రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా లీడ్ పేర్ ఇచ్చిన బోల్డ్ ఛాలెంజెస్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీగా అంచనాలను పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందనే పూర్తి రివ్యూ ఇక్కడ చూద్దాం.

కథ: సంజీవ్ కుమార్ అనగా సంజు (శివకుమార్ కాసారం) జీవితంలో చిన్ననాటి స్నేహితురాలు సహస్ర అలియాస్ ‘సహ’ (శ్వేత లక్ష్మణ్) పాత్ర చాలా ముఖ్యమైనది. చిన్నప్పటి నుంచి ఆమెను ఎంతగానో ఇష్టపడే సంజు, ఆమె కోసం అనేక త్యాగాలు చేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది, ఆ తర్వాత పెద్దలను ఎదిరించి వివాహం చేసుకుంటారు. అయితే పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. సంజు ఉద్యోగం కోల్పోవడం, భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, గర్భవతిగా ఉన్న సమయంలో సహ ఎదుర్కొన్న పరిస్థితులు కథను భావోద్వేగ మలుపు తిప్పుతాయి. సుమారు 40 సంవత్సరాల ఒక యువకుడి జీవిత ప్రయాణంలో ఎదురైన జ్ఞాపకాలు, కష్టాలు, ప్రేమ తాలూకు అంతరాల ఆధారంగా ఈ కథ సాగుతుంది. అసలు సంజు, సహ జీవితాలు చివరకు ఏ గమ్యానికి చేరాయి? వీరిద్దరి మధ్య ఏం జరిగింది? అనేదే అసలు కథ.

నటీనటుల నటన: సంజు పాత్రలో నటించిన శివకుమార్ కాసారం చాలా సహజమైన నటనతో సినిమాను తన భుజాలపై మోశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో, క్లైమాక్స్ లో ఆయన నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఇక హీరోయిన్‌గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలమని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ద్వారా వచ్చే భావోద్వేగాలు సినిమా స్థాయిని పెంచుతాయి. వ్రజనా పాండ్యా తో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.

సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు నిశాంత్ దోటి ఎంచుకున్న పాయింట్ మరియు మెయిన్ థీమ్ చాలా బాగున్నాయి. ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ తిరిగే కథను తెరపై భావోద్వేగంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమా మూడ్‌కు తగినట్లుగా సాగి మెప్పిస్తుంది. కరుణాకర్ కట్టెటి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా సహజంగా, అందంగా ఉన్నాయి. అయితే స్క్రీన్ ప్లే పరంగా అక్కడక్కడి సాగదీత సన్నివేశాలు మైనస్‌గా మారాయి. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే సినిమా వేగం పెరిగేది.

విశ్లేషణ: ‘సహ’ అనేది పూర్తిగా ప్రేమ, జ్ఞాపకాలు, ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కిన ఒక క్లాసిక్ డ్రామా. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా ఉంటే ఫలితం మరోలా ఉండేది. కొన్ని రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకులకు బోరింగ్ అనిపించినప్పటికీ, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ మాత్రం సినిమాను నిలబెడతాయి. లవర్స్ మరియు ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది.