శ‌రీరంలో వేడి త‌గ్గాలంటే ఏం చేయాలి..?

మ‌న‌లో చాలా మంది శ‌రీరంలో అధిక‌ వేడి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంద‌రిలో కాలాలతో సంబంధం లేకుండా వేడి చేస్తుంది.

శరీరంలో వేడి ఎక్కువైన వాళ్లు నీర‌సంగా ఉంటారు. ఎప్పుడూ స్వ‌ల్పంగా జ్వ‌రం వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. కొంద‌రిలో చ‌ర్మంపై చెమ‌ట పొక్కులు, నోటిపూత‌, ఆర్ష మొల‌లు లాంటి స‌మ‌స్య‌లు అన్నీగానీ, వాటిలో ఏదో ఒక‌టిగానీ క‌నిపిస్తుంటుంది. ఇక వ‌య‌సు మ‌ళ్లిన వారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. మ‌రి ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా..?

అధిక వేడివ‌ల్ల జ్వరం వచ్చినట్టుగా, నీర‌సంగా ఉంటే సాధారణంగా తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో నీళ్లను తీసుకోవాలి. రోజూ చ‌ల్ల‌ తాగడం లేదంటే‌ అన్నంలో చ‌ల్ల పోసుకుని తినడం చేయాలి.
వేడి స‌మ‌స్య ద‌రిచేర‌కూడ‌దంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుచ్చకాయ, కర్భూజా, ద్రాక్ష లాంటి పండ్లను తీసుకోవడం ద్వారా సులభంగా వేడిని తగ్గించుకోవచ్చు.
అదేవిధంగా దానిమ్మ ర‌సం, నిమ్మ ర‌సం కూడా శ‌రీరంలో వేడిని త‌గ్గించ‌డానికి తోడ్ప‌డుతాయి. మెంతుల‌ను పొడి చేసుకుని నీళ్ల‌లో వేసుకుని తీసుకున్నా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గసగసాలను పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగినా ఫలితం ఉంటుంది.
అధిక వేడివల్ల కొంద‌రు తలనొప్పి, మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటారు. వేడిని అదుపు చేసుకోవ‌డంవ‌ల్ల‌ ఈ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. ఛాతీ, మణికట్టు భాగాలలో ఐస్‌తో రాసుకుంటే కొంతవ‌ర‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వేడి స‌మ‌స్య ఉన్న‌వాళ్లు చల్లని పాలలో తేనె కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. నుదుటిపై గంధం రాసుకున్నా శరీరంలో వేడి తగ్గుతుంది.
అలోవేరా జ్యూస్ కూడా వేడి స‌మ‌స్య‌కు మంచి ప‌రిష్కారం చూపుతుంది. గాలి త‌గ‌ల‌ని ప్రాంతాల్లో ఎక్కువ‌సేపు గ‌డ‌ప‌డంవ‌ల్ల కూడా వేడి చేస్తుంది. కాబ‌ట్టి ఇంట్లో, ఆఫీస్‌లో వీలైనంత వరకు గాలి తగిలే ప్రదేశంలోనే కూర్చోవాలి.
ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా వేడి స‌మ‌స్య త‌గ్గ‌క‌పోగా ఎక్కువగా చెమటలు పడుతుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవ‌డం ఉత్త‌మం.