రివ్యూ :: ‘ఇరుముడి’ – మాస్ మహారాజా రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా?

కొంతకాలంగా సరైన విజయం లేని మాస్ మహారాజా రవితేజ, తన శైలికి భిన్నంగా ఒక బలమైన సామాజిక అంశంతో కూడిన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఇరుముడి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వాసిక తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ

‘ఇరుముడి’ (Irumudi) ట్రైలర్

కథేంటంటే?

ఒక మారుమూల గ్రామానికి చెందిన త్రినాథ్ (రవితేజ) వ్యవసాయం చేసుకుంటూ, కష్టపడే సాధారణ వ్యక్తి మరియు అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అతనికి కూతురు మణెమ్మ అనగా మణికంట (బేబీ నక్షత్ర) అంటే ప్రాణం. కూతురు ధైర్యంగా ఉండాలని, రోజు జరిగే ప్రతీ విషయాన్ని తనకు చెప్పాలని పెంచుతుంటాడు. ఊళ్లోని ప్రతి ఆడపిల్లను తన సొంత కూతురిలా భావిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. అయితే ఊళ్లో వరుసగా జరుగుతున్న కొన్ని దారుణ సంఘటనలు, మణెమ్మ చుట్టూ తిరిగే కొన్ని పరిణామాలు త్రినాథ్ కుటుంబాన్ని ఏ ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టాయి? ఆ సమస్యల నుంచి తన ఊరి బిడ్డలను త్రినాథ్ ఎలా కాపాడుకున్నాడు? అనేదే ఈ చిత్ర అసలు కథ.

అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఈ కథ సాగినప్పటికీ, ఒక పక్కా కమర్షియల్ చిత్రానికి తగినట్లుగా తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే భావోద్వేగాలను దర్శకుడు మలిచిన తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకే మూలస్తంభంగా నిలిచాయి. ఆ ఉత్కంఠభరితమైన ఘట్టాలలో మాస్ మహారాజా రవితేజ ప్రదర్శించిన నటన ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇక అయ్యప్ప మాల దీక్షలో ఉన్న సమయంలో ఎదురయ్యే ప్రత్యేక పరిస్థితులకు తగినట్లుగా, ఆ పాత్రల స్వభావాన్ని మరియు నేపథ్యాన్ని అత్యంత పకడ్బందీగా తీర్చిదిద్దిన తీరు సినిమా స్థాయిని మరింత పెంచింది.

నటీనటుల పర్ఫార్మెన్స్ హైలైట్స్:

రవితేజ (త్రినాథ్ పాత్ర): త్రినాథ్ పాత్రను నరనరాన ఎక్కించుకుని రవితేజ ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా చివరి అరగంటలో ఆయన నటన అసామాన్యం. త్రినాథ్ పాత్రలో రవితేజను ప్రేక్షకులు చాలా రోజుల పాటు గుర్తుంచుకుంటారు.

నక్షత్ర (కూతురు పాత్ర): రవితేజతో సమానంగా స్క్రీన్ పై ఇంపాక్ట్ చూపించే పాత్ర బేబీ నక్షత్రది. మణికంఠ పాత్ర కోసం ఈ పాపను ఎంచుకోవడమే దర్శకుడు శివ నిర్వాణ సాధించిన అతి పెద్ద సక్సెస్. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయిన ఆమె హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి, ఆ పాత్ర అందరినీ కదిలిస్తుంది.

ప్రియ భవానీ శంకర్: రవితేజకు జోడీగా సగటు మధ్యతరగతి ఇల్లాలి పాత్రకు ప్రియా భవానీ శంకర్ చక్కగా కుదిరింది. కథలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినప్పటికీ, ఉన్నంతలో చాలా బాగా పెర్ఫామ్ చేసింది.

ఇతర తారాగణం: గురుస్వామిగా సాయికుమార్ చాలా గుర్తుండిపోయేలా నటించారు. కేజీఎఫ్ ఫేమ్ రమేష్ ఇందిర కీలక పాత్రలో రాణించగా, స్వాశిక నెగెటివ్ రోల్‌లో మెప్పించింది. అలాగే అజయ్ ఘోష్, మీసాల లక్ష్మణ్, రమణ భార్గవతో పాటు ఇతర సహాయ నటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్:

  1. సామాజిక స్పృహ ఉన్న బలమైన కోర్ ప్లాట్
  2. రవితేజ మరియు బేబీ నక్షత్ర నటన
  3. జి.వి. ప్రకాష్ నేపథ్య సంగీతం & అయ్యప్ప స్వామి పాటలు
  4. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే గ్రిప్పింగ్ నరేషన్ మరియు ట్విస్టులు
  5. హార్ట్ టచింగ్ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

  1. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కొద్దిగా ఊహించే విధంగా (Predictable) సాగడం
  2. కథలో కొన్ని చోట్ల తీవ్రమైన (Disturbing) సన్నివేశాలు ఉండటం

తుది తీర్పు (Verdict)

‘ఇరుముడి’ కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, పేరెంట్స్ అందరూ తప్పకుండా ఆలోచించాల్సిన ఒక మంచి భావోద్వేగభరితమైన చిత్రం. రవితేజ నుంచి వస్తున్న రొటీన్ సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన చిత్రం. బలమైన సందేశంతో కూడిన ఫ్యామిలీ డ్రామాను కోరుకునే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.