రామజన్మభూమి పోరాట చరిత్ర!

కోసలరాజ్యానికి రాజధాని, దశరథుడి రాజ్యసభ, రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం, సరయు నది తీరంలో ఉన్న పట్టణం, శ్రీమహావిష్ణువు అవతారాల్లో ఒకటైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు 500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. ఎన్నో ఉద్యమాలు, సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి పోరాట చరిత్రను పరిశీలిద్దాం.

క్రీ.శ-1528లో బాబర్ ప్రధాన సేనాధిపతి అయిన మీర్ బాకీ అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 1528 నుండి 1934 మధ్య కాలంలో దీని కోసం 76 యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎన్నో తరాల హిందువులు అయోధ్య రామజన్మస్థలం కోసం చేసినవే. కాలక్రమేణా 90వ దశకంలో ఇది దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకొంది.

500 ఏళ్ల పాటు సాగిన పోరాటపు సంక్షిప్త సమాచారం:

బాబర్ కాలంలో (క్రీ.శ1528-1530) 4 యుద్ధాలు జరిగాయి.
హుమాయున్ కాలంలో(క్రీ.శ 1530-1556) 10 యుద్ధాలు జరిగాయి.
అక్బర్ కాలంలో (క్రీ.శ 1556-1606) 20 యుద్ధాలు జరిగాయి.
ఔరంగజేబు కాలం లో (క్రీ.శ 1658-1707) 30 యుద్ధాలు జరిగాయి.
నవాబ్ షాదిత్ ఆలీ కాలంలో (క్రీ.శ 1770- 1814) 5 యుద్ధాలు జరిగాయి.
నసీరుద్దీన్ హైదర్ కాలంలో (క్రీ.శ 1814-1836) 3 యుద్ధాలు జరిగాయి.
వాజీద్ ఆలీషా కాలంలో (క్రీ.శ 1847-1857) 2 యుద్ధాలు జరిగాయి.
బ్రిటిష్ వారి హయాంలో (క్రీ.శ 1912-1934) 2 యుద్ధాలు జరిగాయి.
ఇలా 1934వరకూ హిందూ సమాజం మొత్తం 76 యుద్ధాలు చేసింది.

1934 సం|| అయోధ్యలో కొందరు ముస్లిములు ఒక గోవును హత్య చేయడంతో జరిగిన హిందూ-ముస్లిం ఘర్షణలలో ఆవును చంపిన కసాయి వాళ్ళని తుదముట్టించారు. ఆ తరువాత హిందువులు బాబ్రీ కట్టడoపై దాడి చేసి కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో కట్టడానికి ఉన్న మూడు గుమ్మటాలు దెబ్బతిన్నాయి. అయితే, బ్రిటిషు వాళ్ళు హిందువులనుంచి బాబ్రీ కట్టడాన్ని స్వాధీనం చేసుకుని, దెబ్బతిన్న గుమ్మటాలను బాగుపరచమని హిoదువులమీద జరిమానా విధించారు. 1934 సంవత్సరం నుంచి ఏ ముస్లిం బాబ్రీ కట్టడoలోకి ప్రవేశించలేదు. ఆ తరువాత 1949 లో సీతా – రాముల విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, యూపీ సీఎంతో మాట్లాడారు. అలాగే విగ్రహాలు మసీదు నుంచి తొలగించాలని చెప్పారు. అయితే, దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేసి విగ్రహాలు తొలగించేందుకు నిరాకరించారు. ప్రభుత్వం వివాదాస్పద భూమిగా ప్రకటించి గేట్లు మూసివేయడం జరిగింది.

1984 అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కొన్ని హిందూసంఘాలు కమిటీగా ఏర్పడి డిమాండ్ చేశాయి. ఆ తర్వాత 1989లో రాజీవ్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారనే వాదనలు ఉన్నాయి. వివాదాస్పద భూమి గేట్లు ఓపెన్ చేయాలని చెప్పారు. దీంతో విహెచ్‌పీ, ఆరెస్సెస్ వంటి హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ.. అక్కడ రామాలయం నిర్మించేందుకు ప్రచారం ప్రారంభించింది.

అయోధ్య రథయాత్ర:

1990 అప్పటి బీజేపీ అధ్యక్షుడు ఎల్ కే అద్వానీ సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన 1990, సెప్టెంబర్ 25న ప్రారంభించారు. అయితే, అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ సరిహద్దులో అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది.

బాబ్రీ మసీదు కూల్చివేత:

1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో దేశ నలుమూలల నుంచి పెద్ద యెత్తున కర సేవకులు భజనలు, నినాదాలు చేసుకుంటూ రామ జన్మభూమి అయిన అయోధ్య నగరాన్ని చేరుకొని బాబ్రీ మసీదును కూల్చివేసారు. ఈ ర్యాలీ లో బిజెపి నాయకులైన అద్వానీ, మురళి మనోహర్ జోషి ఉమా భారతి ప్రసంగాలు ఉన్నాయి. ఈ సంఘటనపై జరిపిన దర్యాప్తులో 68 మందిని దీనికి బాధ్యులుగా గుర్తించారు. ఈ మసీదు కూల్చివేత తరువాత అనేక నెలల పాటు దేశంలో హిందూ, ముస్లిముల మధ్య మతకలహాలు జరిగాయి.

రామ జన్మభూమి ఉద్యమం కేవలం ఇటుకలు, సున్నానికి సంబంధించినది కాదు. ఇది దేశ సంస్కృతి సంప్రదాయాలకు తిరిగి గౌరవం సాధించడం. హిందూ అస్తిత్వానికి సంబంధించిన అంశం. ఇలాంటి చారిత్రక ప్రదేశాలు నుండి పురాతన ఆలయాల వలన ప్రజలు వారి గత స్మృతులను గుర్తుచేసుకుని ప్రేరణ పొందుతారు.