అహంకారం ఉంటే అధోగతి!

ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య వెంట్రుక వాసి తేడా మాత్రమే ఉంటుంది. మనం సరైన త్రోవలో ఉన్నామా లేదా అని చాలామంది ఎప్పుడూ తికమకపడుతుంటారు. ఆత్మవిశ్వాసం ముసుగులో మన అహంకారం పనిచేస్తున్నట్టు మనం కనిపెట్టలేము. అహంకారం పెచ్చుమీరినప్పుడు ప్రతిదీ పరాజయంగా మారుతుంది. మితిమీరిన అహంకారంతో దుర్యోధనుడు పరాజయం పొంది చివరకు నీటిమడుగులో ద్రాక్కున్నాడు. ఆత్మవిశ్వాసం, ఓర్పు, సహనంతో పాండవులు రాజ్యలక్ష్మిని పొందారు.

దేవతలందరికీ క్షమాగుణం అలంకారం. “ఓర్పు” అనేక ఇతర సుగుణాలను పెంపొందించుకోవడానికి సహాయకారిగా ఉపయోగపడుతుంది. జీవితంలో విజయం పొందుటకు వ్యక్తికి శ్రద్ధ, ఓర్పు ఎంతో అవసరం. మనిషి బ్రతికి ఉన్నంతకాలం ఎవరో ఒకరు ఏదో విధంగా నిందిస్తూ, అవమానిస్తూ, విమర్శిస్తూ, ఇంకా అనేక విధాలుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇవన్నీ “ఓర్పు” అనే విగ్రహాన్ని తీర్చిదిద్దడానికి మనిషి పై పడుతున్న ఉలి దెబ్బలని భావిస్తే ఆ వ్యక్తి వ్యక్తిత్వం దివ్యంగా మారుతుంది. ఎవరైనా విమర్శిస్తే అందులో ఎంతవరకు వాస్తవం ఉందో గ్రహించాలి. నిజంగా అలాంటి విమర్శ ఉంటే దాన్ని తప్పక తొలగించుకోవాలి.

ఓర్పు విషయములో భూమాతను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. ఎందుకంటే మానవులు నిరంతరం తనకు తన ప్రకృతికి ఎంతో బాధ కలిగించిన సహనంతో మసలుతూ, నిరంతరం క్షమిస్తూ, నిత్యం పూజలు అందుకుంటోంది. “సత్యమేవ జయతే” అన్నట్లు సత్యస్వరూపమైన ఓర్పు, క్షమాగుణం మనిషిని మహాత్ముడిగా మలుస్తుంది. అతనిలో దైవీ గుణాలను జాగృతం చేస్తుంది.