రోగనిరోధకశక్తి పెంపొందటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కరోనా పుణ్యమాని అందరికీ పోషకాహారం మీద శ్రద్ధ బాగానే పెరిగింది. విటమిన్ సి, విటమిన్ డి రోగనిరోధకశక్తిని, ప్రొటీన్ కణజాల నిర్మాణం, కణజాల మరమ్మతులో పాలు పంచుకుని వైరస్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడేలా శరీరానికి శక్తినీ ప్రసాదిస్తుంది.యాంటీబాడీలను, రోగనిరోధక కణాలను తయారు చేసుకోవటానికి రోగనిరోధక వ్యవస్థ ప్రొటీన్ మీదే ఆధారపడుతుంది.
బాడీలో కొద్దిగా పొట్రీన్ తగ్గినా బలహీనత, నిస్సత్తువ ఆవహించేస్తాయి. కాబట్టే ఆహారంలో పప్పులను విధిగా చేర్చుకోవాలని నిపుణులు గట్టిగానే చెబుతున్నారు. వీటిల్లో శాకాహార ప్రొటీన్లు దండిగా ఉంటాయి. పప్పులతో ఒనగూరే మరో ప్రయోజనం- పేగుల ఆరోగ్యానికి తోడ్పడటం.
సాధారణంగా పప్పుల్లోని పోషకాలను చిన్నపేగులు గ్రహించాక.. జీర్ణం కాని పిండి పదార్థాలు (పీచు) పెద్దపేగుకు చేరుకుంటాయి. దీన్ని అక్కడి బ్యాక్టీరియా పులిసిపోయేలా చేసి, పొట్టి గొలుసు కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పెద్దపేగు పైపొర బలోపేతమయ్యేలా చేస్తాయి. వాపు ప్రక్రియనూ నివారిస్తాయి. దీంతో పేగుల్లో గడబిడ (ఐబీడీ), పెద్దపేగు క్యాన్సర్, ఊబకాయం వంటి జబ్బుల ముప్పులూ తగ్గుతాయి. శనగ, బఠానీల వంటి పప్పుల్లోని రాఫినోస్, స్టాకీయోజ్ వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేసే క్రమంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. పప్పు పదార్థాలు తిన్నాక కడుపు ఉబ్బరించినట్టు అనిపించటానికి కారణం ఇదే.
కొందరికి అపాన వాయువు ఎక్కువగా వెలువడుతుంటుంది కూడా. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికీ తోడ్పడుతుంది. ఈ బ్యాక్టీరియా సైతం రోగనిరోధకశక్తి పనితీరులో పాలు పంచుకుంటుందనే సంగతి మరవరాదు. ఇలా పప్పులు మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ప్రస్తుత తరుణంలో వీటి ఆవశ్యకత మరింత పెరిగింది కూడా. అయితే వీటి సుగుణాలను పూర్తిగా పొందాలంటే మాత్రం వండే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అప్పుడే పప్పుల ప్రయోజనాలు బాగా ఉడుకుతాయి!
బాగా కడిగి, నానబెట్టాకే..
పప్పులను వండుకోవటంలో శుభ్రంగా కడగటం, అవసరమైతే నానబెట్టటం చాలా ముఖ్యం. దీనికి కారణం లేకపోలేదు. పప్పుల్లో సోపోనిన్స్ తరగతికి చెందిన రసాయనాలుంటాయి. పప్పులను కడిగినప్పుడు, ఉడకబెట్టినప్పుడు నురగ రావటానికి కారణం ఇవే. వీటిని పెద్ద మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. పప్పులను కుక్కర్‌లో ఉడకపెట్టినప్పుడు ఇవి సేఫ్టీ వాల్వ్‌లో చిక్కుకుపోనూ వచ్చు. మరోవైపు పప్పుల్లోని ఫైటిక్ ఆమ్లం ఇతర సూక్ష్మ పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడుతుంటుంది. పప్పులను శుభ్రంగా కడగటం, నానబెట్టటం ద్వారా వీటిని తొలగించుకోవచ్చు.
నానబెట్టినప్పుడు ఆ నీటిని పారబోసి కొత్త నీరు పోసి ఉడికించుకోవాలనే సంగతినీ మరవరాదు. పప్పులను 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడిగల నీటిలో నానబెడితే పోషకాలు బాగా ఒంట పడతాయి. పెసరపప్పును అంతగా నానబెట్టాల్సిన అవసరం లేదు గానీ కందిపప్పును 10 నిమిషాలు, శనగపప్పును 30 నిమిషాలు, పొట్టుతీయని మినప/రాజ్మా/శనగపప్పును 8 గంటల సేపు నానబెట్టుకోవటం మంచిది.