తెలుగు తెరపై కొత్త దైవిక కథాంశంతో రాబోతున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా నటించిన ఈ దేవోషనల్ థ్రిల్లర్ టీజర్ విడుదల కాగానే ప్రేక్షకుల్లో విశేష స్పందన లభించింది. మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం, టీజర్ స్థాయిలోనే భారీ అంచనాలను రేకెత్తించింది.
వారణాసికి చెందిన గ్రామ దేవత వారాహి మాత, శివుడి ఆజ్ఞ మేరకు మహేంద్రగిరిలో అధిష్టాన దేవతగా వెలిసిందని కథ నేపథ్యం చెబుతోంది. అయితే గత 150 సంవత్సరాలుగా మహేంద్రగిరి రాజవంశానికి చెందిన సభ్యులు ఒక్కొక్కరుగా మరణిస్తుండటం, ఆ మరణాలన్నీ దేవత శాపం వల్లేనని నమ్మకం. ఈ నేపథ్యంలో సాగే రహస్యం, భక్తి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించిన కథాంశంతో చిత్రం రూపొందింది.
‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ డిజిటల్‌గా కోటికిపైగా వ్యూస్ సాధించి, సినీ వర్గాల్లో మంచి చర్చకు దారితీసింది. టీజర్‌లో సుమంత్ ఇంటెన్స్ లుక్, రహస్యమయ వాతావరణం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. టీజర్ సాధించిన వైరల్ విజయంతో, తనపై బాధ్యత మరింత పెరిగిందని, అందుకు తగ్గట్టుగా ఉత్తమ స్థాయి చిత్రాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని దర్శకుడు సంతోష్ జగర్లపూడి పేర్కొన్నారు.
స్టార్‌కాస్ట్ & టెక్నికల్ టీమ్
దర్శకుడు: సంతోష్ జగర్లపూడి
ప్రధాన పాత్రలో: సుమంత్, మీనాక్షి గోస్వామి, ఐశ్వర్య రాజేష్
ఇతర కీలక పాత్రల్లో: మాళవిక నాయర్, మంజు భార్గవి, బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, అలీ, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని
నిర్మాతలు: మధు కలిపు, లక్ష్మణ్ (రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై)
సంగీతం: అనూప్ రూబెన్స్
మ్యూజిక్ లేబుల్: జంగిల్ మ్యూజిక్ తెలుగు
చిత్రీకరణ సమయంలో సుమంత్ ప్రత్యేక కారవాన్ వాడకుండా, నేరుగా షూటింగ్ లొకేషన్‌లోనే ఉంటూ, సినిమాను సకాలంలో, నిర్దేశిత బడ్జెట్‌లో పూర్తి చేసేందుకు చూపిన అంకితభావాన్ని నిర్మాత మధు ప్రత్యేకంగా ప్రశంసించారు. అయ్యప్ప స్వామికి ‘హరిహర సుతా’ తరహా పాటలు ఎంతగా ప్రజాదరణ పొందాయో, అలాగే ఈ చిత్రంలోని వారాహి మాత పాటలు కూడా అంతే ఆదరణ పొందుతాయని నిర్మాత విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రైలర్‌తో సహా చిత్రానికి సంబంధించిన మిగతా కంటెంట్ కూడా సంచలనంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మీడియాతో మాట్లాడుతూ, చిత్రం సెప్టెంబర్ 11, 2026న విడుదల కానున్నట్లు సుమంత్ స్వయంగా ప్రకటించారు. చిత్రం ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్‌గా సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
