నేటి నుంచి కశ్మీర్ అందాలు తిలకించే అవకాశం

ఎన్నో ఏండ్లుగా జమ్ముకశ్మీర్‌లో పర్యటించాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. నేటి నుంచి పర్యాటకులకు ప్రభుత్వం అనుమతినిస్తున్నది. జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు పర్యాటక రంగాన్ని పాక్షికంగా తెరువాలని నిర్ణయించారు. అయితే, ఇక్కడి వస్తున్న పర్యాటకులు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనంటున్నారు అధికారులు.

నేటి నుంచి జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోకి పర్యాటకులు వచ్చేందుకు అనుమతిస్తూ పునర్నిర్మాణ శాఖ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు, కార్యదర్శి సిమర్దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పర్యాటకులు తప్పనిసరిగా విమాన టికెట్, హోటల్ బుకింగ్ కలిగి ఉండాలి. టాక్సీ, ఇతర రవాణా సౌకర్యాలు హోటల్, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

పర్యాటకులు హౌస్‌బోట్, హోటల్ లేదా గెస్ట్ హౌస్‌లో బస చేయడానికి ముందుగానే బుక్ చేసుకోవాలి. బయటి నుంచి వచ్చే పర్యాటకుల స్వాబ్ నమూనాలను స్థానిక విమానాశ్రయంలో తీసుకుంటారు. పరీక్ష ఫలితాలు వచ్చే వరకు పర్యాటకులు హోటల్‌లో ఉండాల్సి ఉంటుంది. పరీక్ష నివేదిక 24 గంటల్లో అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని నివేదికలో తేలితే మాత్రం.. వారు క్వారంటైన్ లో ఉండాల్సి  ఉంటుంది. అట్టివారిని బయట తిరిగేందుకు కూడా అనుమతించరు.

హోటల్ నిర్వహణ కూడా నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకోవాలి. ఆరోగ సేతు యాప్‌ను పర్యాటకులందరు తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడం అవసరం. 65 ఏండ్ల వయసు పైబడిన పర్యాటకులు రాకూడదని సూచించారు. జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూస్తున్నది.