హైదరాబాద్ – గోవా రోడ్డు ప్రయాణానికి మార్గాలు

goa-freshga

హైదరాబాద్ – గోవా రోడ్డు ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మార్గమధ్యంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు పలకరిస్తాయి.

దేశీయ టూరిస్టులతో పాటు అంతే సంఖ్యలో విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారు. గోల్డెన్ బీచ్ లు, తక్కువ ధరలో మద్యం, ఉత్తేజాన్ని నింపే ఉత్సవాలు వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఉంటాయి. కేవలం పార్టీలకు మాత్రమే కాదు, పోర్చుగీసుల సంస్కృతి, నిర్మాణాలకు, రుచికరమైన సముద్రపు ఆహారం, రంగు రంగుల బజార్లు, చర్చిలు, అరుదైన విగ్రహాలకు గోవా ప్రసిద్ధి.

హైదరాబాద్ నుంచి గోవాకి రోడ్ ట్రిప్ కు 13 నుంచి 14 గంటలు పడుతుంది. పశ్చిమ కనుమల గుండా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం మీ ట్రిప్ లో ఉత్తమంగా మిగులుతుంది.

గోవాకు హైదరాబాద్ నుంచి రోడ్డు, విమానం లేదా రైలు మార్గాల్లో వెళ్లవచ్చు. హైదరాబాద్ నుంచి గోవా మధ్య తరచుగా బస్సు సర్వీసులు నడుస్తుంటాయి. టిక్కెట్ ధరలు రూ.800 నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్ నుంచి గోవాకు 700 కిలోమీటర్లు దూరం ఉంటుంది. మీరు రోడ్ ట్రిప్ బాగా ఇష్టపడే వారైతే కార్ లేదా బైక్ ద్వారా మీ ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు.

  1. రాయచూర్ మార్గం:

రూట్ మ్యాప్

హైదరాబాద్ – మహబూబ్ నగర్ – రాయ్ చూర్ – సింధనూర్ – ధర్వాడ్ – అన్మోద్ – గోవా

దారిలో చూసి వెళ్లదగ్గ ప్రదేశాలు:

పిల్ల మర్రి మర్రి చెట్టు: మహబూబ్ నగర్ చేరుకోవడానికి ముందు 500 ఏళ్ల పురాతన మర్రి చెట్టు మీకు కనిపిస్తుంది. దీన్ని తప్పకుండా చూసి వెళ్లండి.

గద్వాల్ కోట: మహబూబ్ నగర్ దాటి రాయ్ చూర్ మార్గంలోకి వెళ్లిన తరువాత గద్వాల్ రోడ్డు మీకు తారసపడుతుంది. ఈ పురాతన కోటను ఇప్పుడు కళాశాలగా మార్చారు.

రాయ్ చూర్ కోట: ఫోటోగ్రఫీ పియులకు కావాల్సిన అద్భుతమైన దృశ్యాలను ఈ చారిత్రక కోట అందిస్తుంది.

ఆంజనేయ ఆలయం: రాయ్ చూర్ లో పురాతన ఆంజనేయ ఆలయాన్ని మీరు సందర్శించవచ్చు. ఇక్కడ ఓ సన్యాసి 12 ఏళ్లు ధ్యానం చేసినట్లు చెబుతారు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

ఉంకల్ సరస్సు: ధర్వాడ్ – హుబ్లి రోడ్ లో పచ్చని పరిసరాల మధ్య ఈ అందమైన సరస్సు ఉంటుంది. ఇక్కడ మీరు బోటింగ్ కు కూడా వెళ్లవచ్చు.

నృపతుంగ బెట్ట: ఉంకల్ లోని కొండ పై భాగంలో నృపతుంగ బెట్ట ఉంటుంది. నిశ్శబ్ధమైన వాతావరణం, పచ్చదనం మధ్య ఇది మీలో నూతనుత్తేజాన్ని నింపుతుంది.

దూద్ సాగర్ జలపాతాలు: నాలుగంచెల ఈ జలపాతాన్ని సందర్శించడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ట్రెక్కింగ్ వంటి సాహసభరిత కార్యక్రమాలకు ఇది పెట్టింది పేరు.

  1. బెలగం మార్గం:

రూట్ మ్యాప్

హైదరాబాద్ – జహీరాబాద్ – కలబురగి (గుల్బర్గా) – బగల్ కోట్ – బెలగం – మొల్లెo – గోవా

జాతీయ రహదారి 65, 50 మీదుగా జహీరాబాద్, బెలగం మార్గం గుండా సాగే ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. 680 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని 14 గంటల్లో పూర్తి చేయవచ్చు. బగల్ కోట్ లోని వివిధ ప్రాచీన పర్యాటక ప్రదేశాలను చూసి వెళ్లాలనుకుంటే రాత్రికి గుల్బర్గాలో బస చేసి వీటిని సందర్శించి వెళ్లవచ్చు.

దారిలో చూడాల్సిన ప్రదేశాలు:

గుల్బర్గా కోట: ప్రపంచంలోనే పొడవైన ఫిరంగి నిలయం ఇది. ఈ కోట వాతావరణం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

gulbarga fort freshga
gulbarga fort freshga

బుద్ధ విహార్: ఈ విస్తారమైన ప్రాంగణం లోపల ప్రశాంతమైన ధ్యాన తరంగాలతో నిండి ఉంటుంది. ఇక్కడి బుద్ధుని విగ్రహం, పచ్చని తోటలు సందర్శకులను ఆకట్టుకుంటాయి.

బాదామి గుహలు: చాళుక్యుల కాలం నాటి రాతి గుహలు, నిర్మాణాలు మిమ్మల్ని ఆ నాటి కాలానికి తీసుకువెళ్తాయి.

మలెగిట్టి శివాలయ కోట, ఆలయాలు: బాదామి గుహలకు ఎదురుగా ఉండే కొండపై ఈ ప్రదేశం ఉంది. ఈ అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవడానికి చిన్న పర్వతారోహణ చేయక తప్పదు.

బూత్ నాథ్ ఆలయం: అగస్త్య సరస్సుకు సమీపంలో ఈ ప్రశాంతమైన ఆలయం ఉంటుంది. ఇక్కడ పరమశివుణ్ణి పూజిస్తారు.

బాణాశంకరి ఆలయం: వైభవమైన సాంస్కృతిక చిత్ర కళతో తీర్చిదిద్దిన ఈ ఆలయంలో శాకాంబరి అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడి వాతావరణం ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది.

బెలగవి కోట: బెలగంకు చేరుకున్నాక అక్కడి ప్రాచీనమైన ఈ కోటను సందర్శించండి. కోట లోపల ఆలయంతో పాటు ఓ ఆశ్రమం కూడా ఉంటుంది.

గోకక్ జలపాతాలు: వర్షాకాలంలో ఈ జలపాతాలను సందర్శించడం బాగుంటుంది. బెలగంకు సమీపంలో ఈ జలపాతాలు ఉంటాయి.

  1. కర్నూల్ మార్గం:

రూట్ మ్యాప్

హైదరాబాద్ – మహబూబ్ నగర్ – కర్నూల్ – బళ్లారి – హోస్పెట్ – హుబ్లి – ధర్వాడ్ – గోవా

కొంచం దూరమైనా ఇది గోవాకు ఇది ఒక గొప్ప మార్గం. జాతీయ రహదారి 44, 67 మీదుగా 730 కిలోమీటర్ల ఈ ప్రయాణాన్ని 15 గంటల్లో పూర్తి చేయవచ్చు.
ఈ క్రింద సూచించిన పర్యాటక ప్రదేశాలను సందర్శించి మీరు అలసిపోయినట్లయితే హంపిలో రాత్రి బస చేసి పొద్దునే గోవాకు ప్రయాణం కావడం మంచిది.

దారిలో చూసి వెళ్లదగ్గ ప్రదేశాలు:

కొండారెడ్డి కోట: కర్నూల్ నగరం యొక్క ప్రధాన ఆకర్షణ అయితే కొండా రెడ్డి కోటను తప్పక సందర్శించండి. ఇక్కడి నుంచి నగర అందాలు అద్భుతంగా కనిపిస్తాయి.

బెల్లం గుహలు: కర్నూల్ దాటి కొన్ని కిలోమీటర్లు వెళ్లిన తరువాత సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ రాతి గుహలను కనుగొనవచ్చు. వివిధ ఆకారాల్లో చూసేందుకు ఎంతో ప్రత్యేకంగా ఇవి కనిపిస్తాయి.

యాగంటి ఆలయం: కర్నూల్ లోని అత్యంత సుందరమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడి గుహల నిర్మాణాలు, నంది శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటాయి.

బళ్లారి కోట: బళ్లారిలోని ఈ అరుదైన కోటను టిప్పు సుల్తాన్ నిర్మించాడు. నీటి తొట్టెలు, రాతి నిర్మాణాలతో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.

దరోజీ ఎలుగుబంట్ల అభయారణ్యం: బళ్లారిలోని ఈ అభయారణ్యంలో భారతదేశంలోని అరుదైన ఎలుగుబంట్లను కనుగొనవచ్చు. వన్యప్రాణులను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం ఎంతో నచ్చుతుంది.

హంపి శిధిలాలు: హంపిలో యునెస్కో వారసత్వ సంపదలుగా పరిరక్షింపబడుతున్న శిధిలాలను మీరు చూడవచ్చు. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు మీకు కనిపిస్తాయి.