గండికోట

‘గండికోట’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప (వైఎస్‌ఆర్)జిల్లా జమ్మలమడుగు మండలం లోని, పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక దుర్గం.

ఎర్రమల పర్వత శ్రేణిపై ఉన్నది. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలు, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే పెన్నానది. ఈ కోటకు సహజసిద్ధమైన రక్షణ కవచాలు.

గండికోటలో ‘గిరి దుర్గాలు’గా పిలువబడే కోటలున్నాయి. వీటి నిర్మాణశైలి ఆశ్చర్యం కలిగిస్తుంది. సాంకేతిక పరిజ్జానం అంతగా అందుబాటులోలేని సమయంలోనే పునాదులే లేకుండా ఏర్పాటు చేసిన ఈ కోట నిర్మాణశైలి మహాద్భుతంగా ఉంది. కోట చుట్టూ ఉన్న పచ్చటి కొండలు, ఆ కొండల నడుమన ఉన్న పెన్నానది ప్రకృతి ఆరాధకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మినార్లు చెప్పుకోదగ్గ కట్టడాలుగా ఉన్నాయి. రంగనాథాలయం, మాధవరాయ ఆలయం ప్రస్తుతము శిథిలమైనప్పటికీ శిల్పకళా సంపద చూడదగినది. నీటి వసతి కోసం చెరువులు, బావులు ఉన్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం ఇక్కడి ప్రత్యేకత.

పెమ్మసాని తిమ్మానాయుడు
విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించాడు. ఈతని అల్లుడు పెమ్మసాని తిమ్మానాయుడు. ధరణికోట సమీపమున గల బెల్లంకొండ వాస్తవ్యుడు. మగ సంతానములేని కారణమున రామానాయుని తదుపరి తిమ్మానాయునికి అధికారము సంక్రమించింది. కలుబురిగె (గుల్బర్గా) యుద్ధములో తిమ్మానాయుని సాహసానికి సంతసించి రెండవ ప్రౌఢ దేవరాయలు క్రీ. శ. 1422లో పరగణా వ్రాసి ఇచ్చాడు. తిమ్మానాయుడు క్రమముగా తన రాజ్యాన్ని గుత్తి, తాడిపత్రి, జమ్మలమడుగు ప్రాంతాలకు విస్తరించాడు. ఈతని తదుపరి వరుసగా పెమ్మసాని రామలింగ నాయుడు, పెదతిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నారసింహ, బొజ్జతిమ్మ మొదలగు వారు పాలించారు. విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నమైనప్పుడు కుతుబ్ షాహీలు ఈ కోటను కుట్రపన్ని వశం చేసుకున్నారు. పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా, పెమ్మసాని కుమార తిమ్మానాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజుల పౌరుషాలకు, యుద్ద తంత్రాలకు నిలయంగా చెబుతారు. కమ్మ నాయకులు గండికోటను మూడు వందలయేళ్ళకు పైగా పరిపాలించారు. చివరి పాలకుడు చినతిమ్మా నాయుని కాలములో గండికోట ముస్లిముల వశమయ్యింది.

మీర్ జుమ్లా
మీర్ జుమ్లా పారశీక (ఇరాన్) దేశానికి చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గొల్లకొండ(గోల్కొండ) రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి భారతదేశము చేరాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. మచిలీపట్టణములో స్థావరము ఏర్పరచుకొని తెలుగు దేశములోని వజ్రసంపదపై గురిపెట్టాడు.

విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట, జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గొల్లకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలంతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యంతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రం తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడు ఉన్నాడు.

యుద్ధం
అనేక దినాల భీకరయుద్ధం తరువాత కూడా కోట వశము కాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారాయి. గండికోట అప్పగిస్తే గుత్తి దుర్గానికి అధిపతిని చేస్తానని జుమ్లా బేరసారాలు చేశాడు. మంత్రి చెన్నమరాజు సంధి చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. కాని తిమ్మానాయుడు అంగీకరించలేదు. విజయమో వీరస్వర్గమో రణభూమిలోనే తేలగలదని నాయుని అభిప్రాయం. క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చాడు. ఈ ఫిరంగుల ధాటికి కోట గోడలు బద్దలయ్యాయి. యుద్ధం మలుపు తిరిగింది. వేలాది యోధులు కోటను పరిరక్షిస్తూ ఫ్రెంచ్ ఫిరంగుల దాడిలో మరణించారు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహనాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ సతీసహగమనము చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణానికి కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరించింది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి, వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకారు. హతాశుడైన చినతిమ్మ రాయబారానికి తలొగ్గక తప్పలేదు.


గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందం కుదిరింది. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషం ఇప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతిని చేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువుల కప్పగించి రాజ్యము దాటిస్తాడు. తిమ్మానాయుడు విషప్రభావము వల్ల మరణించాడు. యుద్ధం ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలోనున్న మీర్ జుమ్లాను కలిశాడు. ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో వ్రాశాడు.

పతనం
మీర్ జుమ్లా గండికోటలోని మాధవస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మించాడు. దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించాడు. కోటను ఫిరంగుల తయారీకి స్థావరంగా మార్చాడు. గండికోటపై సాధించిన విజయంతో మీర్ జుమ్లా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అయ్యాడు. ఈ సమయములోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల వర్తకుడు టావర్నియెర్ గండికోటను సందర్శించాడు.

బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయనాయుణ్ణి తమిళదేశానికి తరలించారు. గండికోటలోని అరవయ్యారు ఇంటిపేర్లు గల కమ్మ వంశాలవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోయారు. వీరికే ‘గంపకమ్మవారు’, ‘గండికోట కమ్మవారు’ అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్పనాయుడు, నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్‌పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.

మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయాలు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు, గండికోట నాయకులు.