తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరములో ఉంది. గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందినది. ఈ ప్రాంతం మొదట కాకతీయుల ఏలుబడిలో ఉండేది. ఓరుగంటి సామ్రాజ్యములో కాకతీయులకు, ముసునూరి కమ్మరాజులకు గోల్కొండ ముఖ్యమైన కోట. కాకతీయుల పతనంతో గోల్కొండ కోట తొలుతగా 1323లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుఘ్ ఖాన్ వశమయ్యింది. పిదప ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి ఓరుగల్లుతో బాటు గోల్కొండను తిరిగి సాధించారు. తర్వాత కాలంలో బహమనీ రాజ్యమునకు ముసునూరి కమ్మరాజులకి మధ్య జరిగిన సంఘర్షణలో, తెలుగు రాజుల అంతఃకలహాల వలన బలహీనపడిన కాపయ నాయకుడు మహమ్మద్ షాతో చేసుకున్న సంధిలో భాగంగా గోల్కొండను శాశ్వతముగా వదులుకున్నాడు. ఈ విధముగా 1364లో గోల్కొండ కోట హిందువులనుండి చేజారి పోయింది. తరువాత నవాబులు పాలించారు.
1507 నుండి గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్తులు నల్లరాతి కోటగా తయారు చేశారు. 1687లో ఔరంగజేబు దండయాత్రతో కుతుబ్షాహీల పాలన అంతమయినది. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచప్రసిద్దమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యములోని పరిటాల-కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనము, వజ్రాలు నవాబులును సుసంపన్నం చేశాయి. నిజాం నవాబులు మొగలు చక్రవర్తులనుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948లో భారత్‌లో విలీనమయ్యేంతవరకు పరిపాలించారు.
గోల్కొండ నాలుగు వేర్వేరు కోటల సముదాయం, ఒకదానిని చుట్టి మరొకటి నిర్మించబడ్డాయి. కోటను పెంచుటలో, పటిష్ఠపరుచటలో కుతుబ్‌షాహిలదే ప్రధాన పాత్ర. మొదటి నిజాం వశమైన కాలంలో కోట వెలుపలి భాగాన తూర్పు దిక్కున ఒక గుట్ట ఉండేది. దానిని శత్రువు ఆక్రమిస్తే తరలించుట కష్టమని భావించిన నిజాం, గుట్టను కోటలోపలికి కలుపుతూ చుట్టూ గోడను నిర్మించాడు. దుర్గం చుట్టూ గుట్టలు పెట్టని కోటలవలె ఉన్నాయి. ఈ కోట 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో, తొమ్మిది దర్వాజాలతో, 10 కి.మీ. పొడవు గోడను కలిగి ఉంది.