తెలంగాణ…ధూళి కోట

తెలంగాణ: కోటిలింగాల తర్వాత తెలంగాణలోని అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతం ధూళి కోట (మట్టి కోట) లేదా ధూళికట్ట. దూలికట్ట, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ఎలిగెడు నుండి 4 కి. మీ. దూరం లోను, హుస్సేనివాగు ఒడ్డున కరీంనగర్ కు 20 కిమీ దూరంలో ఉన్న చారిత్రాత్మకమైన గ్రామం. ఇది శాతవాహనుల కాలంనాటి ఆవాసము. మెగస్తనీసు ఇండికాలో ప్రస్తావించిన ఆంధ్రుల యొక్క ముప్పై కోటలలో ధూళికట్ట ఒకటని శాసనాధారాల వల్ల తెలుస్తుంది. 1975-76లలో పురావస్తు శాఖ వారి త్రవ్వకాలలో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధస్థూపం బయటపడ్డాయి. ఈ తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి, భూమి కంటే 6 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ 3 నుంచి 5 మీటర్ల ఎత్తున మట్టి ప్రాకారం ఉంది. గోడల చుట్టూ కందకాలు ఉన్నాయి. కోటకు నాలుగు దిక్కుల నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. దక్షిణ ద్వారానికి ఇరువైపులా భటుల గదులున్నాయి. ఈ ద్వారానికి ఉత్తరాన కొన్ని రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు బయటపడ్డాయి.