ఆంధ్రప్రదేశ్: విజయనగరం జిల్లా, బొబ్బిలిలో ఉంది. బొబ్బిలి సంస్థానం 17వ శతాబ్దంలో పెద్దారాయుడుచే ఏర్పాటుచేయబడినది. ఇతను వెలుగోటి వంశీయులకు చెందిన వెంకటగిరి రాజుల 15వ వారసుడు. శ్రీకాకుళం నవాబు షేర్ మహ్మద్ ఖాన్ కు, వెంకటగిరి మహారాజవారు దక్షిణాదిలో చేసిన సేవలకు ప్రతిఫలంగా బొబ్బిలిని ఇచ్చారంటారు. బొబ్బిలి యొక్క పూర్వనామం పెద్దపులి. తరువాత అది రానురాను బొబ్బిలిగా రూపాంతరం చెందింది.
తాండ్ర పాపారాయుడు:
బొబ్బిలి విజయనగర రాజుల వశం కాకూడదని పొరాడిన రాజాం సంస్థానాధీశుడు తాండ్ర పాపారాయుడు. ఫ్రెంచి వారి సహాయంతో బొబ్బిలి మీదకు యుద్ధానికి వచ్చిన విజయనగరం ప్రభువు విజయరామరాజును హతమార్చి, శవాల దిబ్బగా మారిన బొబ్బిలి ని చూసి తీవ్ర మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటాడు. బొబ్బిలి పట్టణం పేరు వినగానే 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం గుర్తుకువస్తుంది. ఎందుకంటే, చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా బొబ్బిలి యుద్ధానికున్న ప్రత్యేకత వేరు. బొబ్బిలి పట్టణాన్ని పౌరుషానికి ప్రతీకగా చెబుతారు. తాండ్ర పాపారాయుడు వీరత్వం ప్రతాపానికి సాక్ష్యంగా నిలించింది. అందుకే ఈ యుద్దం గురించి వీరగాధ పాటగా, బుర్రకథగా, నాటకంగా, చలనచిత్రంగా ప్రజలలో ప్రాచూర్యం పొందాయి. అప్పటి యుద్దానికి చిహ్నంగా విజయనగరం జిల్లాలోని భైరవసాగరం వద్ద స్మారక స్థూపం నొకదానిని చిహ్నంగా నిర్మించబడింది.
కోట ప్రత్వేకతలు:
బొబ్బిలి కోట లో దక్షిణ దేవుడు, పడమర దేవుడు, ఉత్తర దేవుడు అనే మూడు ముఖద్వారాలు ఉన్నాయి. రాజ వంశీయులు మాత్రమే ఉత్తర దేవుడు ద్వారా ప్రవేశం చేయడానికి అవకాశం కల్పించబడింది. మిగిలిన రెండు ద్వారాలు సందర్శకులు నిత్యం వచ్చివెళ్లేందుకు వీలు కలిగించబడింది. ఆ రోజుల్లో దర్బార్లు నిర్వహించడం కోసం ప్రత్యేక మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ దర్బార్‌మహాల్ కోటకు ఆకర్షణగా ఉంది. బొబ్బిలి రాజులకు చెందిన గెస్ట్ హౌస్‌కు గొప్ప ప్రాచుర్యం ఉంది. ఇప్పటికీ సందర్శకులు గెస్ట్ హౌస్‌ను చూసేందుకు వెళుతుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో రాజులు వినియోగించిన సింహాసనాలు, పల్లకీలు రాచరిక భోగభాగ్యాలకు నిలువుటద్దంలా కనిపించే, పురాతన నిర్మాణాలు, వస్తు సామగ్రి, వాహనాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. శత్రు దుర్భేద్యంగా కోట చుట్టూ నిర్మించిన ఎత్తయిన ప్రహరీ సందర్శకులును ఆకట్టుకుంటుంది. సుమారు 40 అడుగుల ఎత్తుగల సింహద్వారాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. కోటలోపల అనేక భవనాలు, లోగిళ్లు, మండపాలు కలిగి ఓ గ్రామంలా సందర్శకులకు అనిపిస్తుంది. కోటలో నిర్మించిన ఏడు పురాతన భవనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సప్తమహాల్స్‌గా పిలుస్తారు. వందల సంవత్సరాలు గడిచినా ఈ భవనాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
మ్యూజియంగా ఏర్పాటు:
బొబ్బిలి యుద్ధంలో తాండ్రపాపారాయుడు వినియోగించిన ఖడ్గం ఇప్పటికీ మ్యూజియంలో ఉంది. తాండ్ర పాపారాయుడు జరిపిన పోరులో ఖడ్గానికి బుల్లెట్ తగిలిన గుర్తు ఖడ్గం మీద సందర్శకులను ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తెచ్చిన సింహాసనం, తుపాకులు, రాజులు ధరించిన అతిఖరీదైన వస్త్రాలు, వినియోగించిన కత్తులు, కటారులు, తలపాగాలు, కిరీటాలు, వేటాడిన పెద్దపులుల చర్మాలు చారిత్రక ఆధారాలను చూపించే మరిన్నిచిత్రాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.