ఉత్తరం వైపు తల ఎందుకు పెట్టరంటే…

పడకగదిలో మంచం వేసుకునేటప్పుడు దిక్కులు చూసుకునే వేస్తుంటారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మినా నమ్మకున్నా చాలామంది దీన్ని ఆచరిస్తుంటారు.

వీలునిబట్టి తలను ఏ దిక్కుకు పెట్టుకుని పడుకున్నా, ఉత్తరానికి మాత్రం అస్సలు పెట్టకూడదనీ అలా పెడితే కలలోకి దెయ్యాలు వస్తాయనీ త్వరగా చనిపోతారనీ మొత్తమ్మీద ఆరోగ్యానికి మంచిది కాదనీ చెబుతుంటారు. అయితే అవన్నీ మూఢనమ్మకాలే కావచ్చు కానీ అలా వద్దనడం వెనకా ఓ కారణం ఉంది అంటున్నారు సంప్రదాయ శాస్త్రీయవాదులు. ఎందుకంటే, భూమి అతి పెద్ద అయస్కాంతం. అలాగే మనిషి శరీరమూ ఓ అయస్కాంత క్షేత్రమే. దానికి కేంద్ర స్థానం హృదయం. అక్కడినుంచి రక్తం అన్ని భాగాలకీ ప్రసరించి, మళ్లీ అక్కడికే చేరుకుంటుంది. అయితే అయస్కాంత ప్రభావం ఉత్తర, దక్షిణ దిశల్లో కేంద్రీకృతమై ఉంటుందని తెలిసిందే. అందువల్ల ఉత్తరార్ధగోళంలో ఉన్నవాళ్లు ఉత్తరానికి తల పెట్టుకుని పడుకుంటే- భూఅయస్కాంత ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంమీద ప్రభావం చూపడంతో రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి.

ముఖ్యంగా రక్తంలోని ఐరన్‌ అయస్కాంత ప్రభావానికి లోనయి ఉత్తర దిశగా ఆకర్షితమవడంవల్ల మెదడులోకి అధిక రక్తం ప్రవహిస్తుంది. దీనికోసం గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో బీపీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందట. రక్తనాళాలు బలహీనంగా ఉన్నవాళ్లలో ఇది మరీ ఎక్కువ. అందుకే ఆ దిశగా పడుకున్నప్పుడు తలనొప్పీ, రక్త సరఫరాలో ఇబ్బందుల వల్ల నిద్రలో మెలకువా రావచ్చు. ఆ కారణంతోనే ఉత్తరార్ధ గోళంలో ఉన్నవాళ్లని ఉత్తరానికీ దక్షిణార్ధగోళంలో ఉన్నవాళ్లని దక్షిణానికీ తప్ప మిగిలిన ఏ దిక్కుకైనా తల పెట్టుకోవచ్చని చెబుతారు.