బాలయ్య వెర్సస్ చిరు.. ??

గత కొన్నేళ్లలో ఒక స్టార్ హీరో సినిమా.. ఇంకో స్టార్ హీరో సినిమాతో తలపడటం అరుదైపోయింది. కానీ ఒకప్పుడు మాత్రం భారీ సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టేవి. ముఖ్యంగా సంక్రాంతి.. దసరా లాంటి పండగలొస్తే క్లాష్ ఆఫ్ టైటాన్స్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచేది. టాలీవుడ్ టాప్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సమరానికి దిగితే సందడి మామూలుగా ఉండేది కాదు. ఒకసారి చిరంజీవి పైచేయి సాధిస్తే.. ఇంకోసారి బాలయ్య ఆధిపత్యం చలాయించాడు. కొన్నిసార్లు ఇద్దరి సినిమాలూ కలెక్షన్ల వర్షం కురిపించేవి. ఇలా ఐదుసార్లు.. పదిసార్లు కాదు.. ఏకంగా 18 సార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు చిరు-బాలయ్య.

చివరిగా వీళ్లిద్దరూ తలపడ్డది 2001లో. అది కూడా సంక్రాంతికే కావడం విశేషం. చిరు ‘మృగరాజు’గా వస్తే.. బాలయ్య ‘నరసింహనాయుడు’ అవతారమెత్తారు. అప్పుడు ‘మృగరాజు’ డిజాస్టర్ అయితే.. ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్టయింది. ఇప్పుడు 19వ సారి బాక్సాఫీస్ సమరానికి సై అంటున్నారు చిరు-బాలయ్య. రాబోయే సంక్రాంతికి వీళ్లిద్దరూ మరోసారి తలపబడబోతున్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరు చేస్తున్న సినిమా.. పైగా ఆయనకు 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ సంక్రాంతి రేసులో ఉంది. అలాగే బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా అదే పండక్కి వస్తోంది. ఇద్దరికీ ఇవి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. పైగా సంక్రాంతి సీజన్లో ఒకేసారి తలపడబోతున్నాయి. కాబట్టి బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉండటం ఖాయం.

 

balayya vs chiranjeevi at sankranti