దేవలోకం నుండి భూలోకానికి వచ్చిన ఆయుర్వేదం…

ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం చెబుతోంది. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. ఈ ఆయుర్వేద వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.

కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగర మధనం చేశారు. ఆ సాగర మధనం నుండి శ్రీమహాలక్ష్మి, కౌస్తుబామణి, ఐరావతం, కల్పవృక్షం, కామదేనువు, చంద్రుడు, దివ్యరత్నరాశులు, అమృతం ఉద్భవించాయి. అన్నిటికంటే ముందుగా హలాహలం పుట్టింది. ఆ భయంకరమైన విషాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో ఆభరణంగా నిలుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ధన్వంతరి అనే దివ్య పురుషుడు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించి ఒక చేతిలో అమృతభాండం మరొక చేత ఆయుర్వేదం పట్టుకొని ప్రత్యక్షమై ఆ పాలకడలి నుండి వెలుపలికి వచ్చాడు. ఆ అమృతభాండాన్ని చూసిన దానవులు, దేవతలను ఓడించి అమృతాన్ని తీసుకెళ్తారు. శ్రీ మహావిష్ణువు మాయా మోహిని రూపం ధరించి రోగ, మరణ భయం లేని అమృతాన్ని దేవతలకు పంచి అజరామరులూగా చేసాడు.

వేద స్వరూపమైన ఆయుర్వేదాన్ని, అధర్వణ వేదానికి ఉపవేదంగా చెబుతారు. ఈ ఆయుర్వేదాన్ని ధన్వంతరి బ్రహ్మకు అందించాడు. ఆయన ద్వారా దక్షప్రజాపతికి లభించింది. దక్షప్రజాపతి నుండి సురలోక వైద్యులైన అశ్విని కుమారులకు ప్రాప్తించింది. ఒకసారి వశిష్ఠ, భరద్వాజ, అంగీరస, అత్రి, దుర్వాస, విశ్వామిత్ర మహర్షులందరూ హిమవత్పర్వతం మీద సమావేశమయ్యారు. మానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది. దేవలోకం నుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకున్నారు. భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్లి ఆయుర్వేదాన్ని అభ్యసించి ఆత్రేయుడు అనే మహర్షికి బోధించాడు. ఈ మహర్షి, అగ్నివేశమహర్షికి ఉపదేశం చేశాడు. ఆత్రేయుని వద్ద నేర్చుకున్న ఆయుర్వేద రహస్యాలను అగ్నివేశమహర్షి మహాశాస్త్రంగా రచించాడు. దీనినే “అగ్నివేశతంత్రము” అంటారు.

ఈ “అగ్నివేశతంత్రము” కాలక్రమేణా “చరకసంహిత” గా రూపుదిద్దుకుంది. చరకుడు ఆయుర్వేదానికి ఆది గురువుగా మనం ఆరాధిస్తున్నాం. అలా మానవాళిని రక్షించేందుకు దేవలోకం నుండి భూలోకానికి ఆయుర్వేదం వచ్చింది. ఇది సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవన వేదం అయింది.