అరుణాచలేశ్వర స్వామి దేవాలయం తిరుణ్ణాములై

మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని ‘‘అన్నామలై’’ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు.

అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ.. మొత్తంగా ఎర్రని కొండ అని అర్థం. దైవశాస్త్రాల ప్రకారం అ-రుణ అంటే పాపాలను సంహరించేది అని అర్థం. తమిళంలో దీనిని ‘‘తిరుణ్ణాములై’’ అని పిలుస్తారు.
పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో పుణ్య, గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని, శివుడిని భక్తితో స్మరిస్తే.. చేసిన పాపాలన్నీ తొలగిపోయి, విముక్తి లభిస్తుందని వేదపండితులు కూడా నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ, చిదంబరం, తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి, దేవాలయానికి సంబంధించి పురాణాలలో విశిష్టమైన కథలు కూడా తెలుపబడివున్నాయి.
పురాణాల ప్రకారం… పూర్వం శివుడు భూమిపై జరుగుతున్న పాపాలను, దుష్టకార్యాలను, అన్యాయాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు. దాంతో ఆయన విశ్వకర్మను ఈ అరుణాచలం ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుని ఆజ్ఞను శిరసావహించి విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఆ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. స్కాందపురాణంలో అంతర్గతమైన అరుణాలమహాత్యం ప్రకారం.. ఈ ఆలయంలో పూజావిధానం శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని విశదీకరించబడింది.

పురాణాలలో వున్న కథనాల ప్రకారం.. ఈ అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని పేర్కోవడం ద్వారా.. ఈ కొండకు తూర్పు భాగంలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కొండకు అరుణాచలేశ్వరాలయం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా! ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని అగ్ని క్షేత్రమంటారు.
సాక్షాత్తూ పరమశివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ అరుణాచలం చుట్టూ శివునిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణం చేయడం వల్ల.. శివుని అనుగ్రహం లభిస్తుందని, ఏకంగా శివునికే ప్రదక్షిణలు చేసేంత ప్రభావం లభిస్తుందని, పూర్వం మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి, కర్మల నుంచి విముక్తి పొందుతామని అప్పటి మహాత్ములు పేర్కొన్నారు. దీని ప్రాముఖ్యతను నలువైపులా విస్తరించడానికి శ్రీరమణులు కూడా పదేపదే ఉద్ఘోషించారు కూడా! అందువల్ల ఈ ప్రదేశంలో వేలాదిమంది భక్తులు నిత్యం గిరిప్రదక్షిణం చేస్తూ వుంటారు.

entrance_arch_new

రమణాశ్రమం :
అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే రమణాశ్రమం వుంటుంది. ఈ ఆశ్రమంలో శ్రీరమణుల సమాధులు వున్నాయి. ఇందులో ఇంకా ఆవు, కాకి, శునకం వంటి మొదలైన జంతువుల సమాధులు కూడా చూడవచ్చు. ఈ ఆశ్రమంలో రమణులకు సంబంధించిన పురాణ కథల పుస్తకాలు అందుబాటులో వుంటాయి. ఈ ఆశ్రమంలో ప్రార్థన చేసుకోవడానికి వీలుగా వసతులు, సదుపాయాలు, వాతావరణం అనుకూలంగా వుంటాయి.

శేషాద్రి స్వామి ఆశ్రమం :
ఈ ఆశ్రమం కూడా అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే వుంటుంది. రమణాశ్రమానికి వెళ్లే దారిలోనే శేషాద్రి స్వామివారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇందులో శేషాద్రి స్వామివారి సమాధి వుంటుంది. ఇక్కడ కూడా శివుడిని భక్తితో ప్రార్థించుకోవడానికి వీలుగా వాతావరణం అనుకూలంగా వుంటుంది.