దానిమ్మ పండు చేసే లాభాలు

ఎరుపు రంగులో నిగ నిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే ‘దానిమ్మ’ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పొడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే దానిమ్మ మన దగ్గర ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.

2. దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.

3. ఎముకల ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.

4. లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సంతాన సాఫల్యతను పెంచే శక్తి దీనికి ఉంది. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

5. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధ పడేవారికి ఇది మంచి మందు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అల్సర్లను నివారిస్తాయి, దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

6. రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్తంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార పేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. దానిమ్మ రసంలోని రసాయనాలు కొలెస్ట్రాల్ వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించే గుణం దీనికి ఉంది. రక్తనాళాలు మూసుకుపోకుండా చూస్తుంది.

7. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది. వాపును అరికడుతుంది. దానిమ్మ ఆకుల నూనె రాసుకుని వాపు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.