History :- బ్రహ్మదేవుడి కుమారుడైన దక్షప్రజాపతి కుమారై సతీదేవి శివుడిని వివాహాం చేసుకుంది. ఒకానొక సమయంలో త్రిమూర్తులు దేవసభ ఏర్పాటు చేశారు. అ సభకు దేవాదిదేవతలంతా హాజరయ్యారు. దక్షుడు సభకు అలస్యంగా వచ్చారు. అ సమయంలో శివుడు లేనందున అవమానంగా భావించి వెళ్లిపోయాడు. శివతత్వం దృష్టి తెలియక దక్షుడు శివుడిని విస్మరించి నిరీశ్వర యాగం తలపెట్టాడు. అ యాగానికి దేవతలందరిని పిలిచి సతీదేవి, శివుడిని మాత్రం ఆహ్వానించ లేదు. తండ్రి తల పెట్టిన యాగానికి శివుడు ఎంత వద్దని చెప్పినా వినకుండా సతీదేవి వెళ్తుంది. అక్కడ దక్షప్రజాపతి శివుడిని అపహస్యం చేస్తూ నిందిస్తాడు. దీంతో మనస్తాపానికి గురైన సతీదేవి అక్కడే ఆత్మార్పణ చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయరుద్రుడై సతీదేవి మృతదేహంతో సృష్టిని మరిచి తాండవం చేశాడు. శివుడిని శాంతింప చేసే ప్రయత్నంలో దేవతలంతా కలసి విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. దాంతో శివుడి భుజంపై ఉన్న సతీదేవి మృతదేహాన్ని ఆ చక్రం 108 శకలాలుగా చేయడంతో ఒక్కొక్క శకలం ఒక్కో ప్రదేశంలో పడిపోయింది. అ భాగాలే శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయి. ప్రధానమైన శరీర భాగాలు 18. ఈ భాగాల్ని శక్తిపీఠాలుగా ఆది శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ చేశారు. భారత దేశంలో 17 శరీర భాగాలు, శ్రీలంకలో ఒక భాగం ఉంది.

Aadi Shankaracharya’s Stotram :-

Lankayam Shankari devi, Kamakshi Kanchika pure /
Pradyumne Shrinkhala devi, Chamunda Krouncha pattane //

Alampure Jogulamba, Sri shaile Bhramarambika /
Kolha pure Maha lakshmi, Mahurye Ekaveerika //

Ujjainyam Maha kali, Peethikayam Puruhutika /
Odhyane Girija devi, Manikya Daksha vatike //

Hari kshetre Kama rupi, Prayage Madhaveshwari /
Jwalayam Vishnavi devi, Gaya Mangalya gourika //

Varanasyam Vishalakshi, Kashmire tu Saraswati /
Ashtadasha Shakti peethani, Yoginamapi durlabham //

Sayamkale pathennityam, Sarva shatri vinashanam /
Sarva roga haram divyam, Sarva sampatkaram shubham //

1.శాంకరీదేవి ( శ్రీలంక )

రావణస్తుతి సంతుష్టాకృత లంకాధివాసినీ
సీతాహరణ దోషేణ త్యక్తలంకా మహేశ్వరీ
సజ్జనస్తుతి సంతుష్టా కదంబవనవాసినీ
లంకాయాం శాంకరీదేవీ రక్షేత్‌ ధర్మ పరాయణా!!

‘రావణుని స్తోత్రాల చేత సంతుష్టురాలై, అతని లంకాపట్టణంలో నివసించడానికి అంగీకరించింది. కానీ రావణుడి దోషమైన సీతాపహరణం వల్ల లంకను వీడిన మహేశ్వరివి నీవే. శాంకరిగా, కదంబవనవాసినిగా సజ్జనుల చేత స్తుతించబడే వనదుర్గా.. మాకు ధార్మిక ప్రవృత్తిని కలిగించి మమ్మల్ని… అంటూ శాంకరీదేవిని భక్తులు కొలుస్తారు. ప్రస్తుతం శ్రీలంకగా చెలామణీలో ఉన్న ఒకనాటి లంకాపట్టణమే శాంకరీదేవి నెలకొన్న శక్తి పీఠక్షేత్రం. పశ్చిమ సముద్రతీరాన ట్రింకోమలి పట్టణంలో ఈ మొదటి శక్తిపీఠం ఉంది. ఈ తల్లిని మహర్షులు వనశంకరి అని పిలిచేవారు. వనం అంటే నీరు, అడవి అనే అర్థాలున్నాయి. లంక చుట్టూ నీరు ఉండటం సహజమే. పైగా ఆమె కదంబవనవాసిని. ఏ విధంగా చూసినా వనశాంకరీదేవి, లంకా శక్తిపీఠసంస్థితగానే భావించాలి. అమ్మను వనదుర్గా మంత్రంతోనూ పూజిస్తారు. ఈ తల్లి రాక్షసగుణాలను సంహరిస్తూ, ధర్మాన్ని రక్షిస్తూ భక్తపాలన చేస్తుందని అంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకున్న పోర్చుగీసువారు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేసినా అమ్మవారి విగ్రహం మాత్రం పదిలంగా ఉంది. పురాతన ఆలయం పక్కనే మరో ఆలయం నిర్మించారు.

2.కామాక్షమ్మ (కంచి)

శివనేత్రే నిమీల్యైవ ధృతా కాత్యాయనీ వపుః
గంగాప్లావ సముద్విగ్నా సైకతం లింగమాశ్రితా
భక్తానామిష్టదా నిత్యం కామాక్షీ కాంచికాపురే
ఏకామ్రనాధ గృహిణీ శుభం – కుర్యాన్మహేశ్వరీ!!

అష్ట దశ శక్తి పీఠాల్లో రెండో శక్తిపీఠం కామాక్షి అమ్మవారి ఆలయం, తమిళనాడు రాష్ట్రం, కాంచీపురంలో ఉంది. ఈ ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో పల్లవ వంశ రాజులు నిర్మించారని, ఆ తరువాత కాంచీపురాన్ని పాలించిన రాజులు అమ్మవారి ఆలయ విస్తరణకు అనేక పనులు చేపట్టి అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి శక్తి పీఠాన్ని నాభి స్ధాన శక్తి పీఠం అని పిలుస్తారు. ‘క’ అంటే సరస్వతీ రూపం, ‘మా’ అనేది లక్ష్మీ రూపం, ‘అక్షి’ అంటే నేత్రం అని అర్ధం. ఈమేరకు కంచిలో లక్ష్మి, సరస్వతిగా కామక్షి అమ్మవారు దర్శనిమిస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే లలిత సహస్ర నామ జపమే అనువైన మార్గం అని భక్తులు నమ్ముతారు. కంచి రెండో శక్తిపీఠంగా గుర్తింపు పొందింది.
మూడు రూపాల్లో… కామాక్షి అమ్మవారి ఆలయాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఏటా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను మొదటి మూడు రోజులు అమ్మవారిని దుర్గా దేవిగా, తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవిగా, చివరి మూడు రోజుల్ని సరస్వతీదేవిగా అలంకరించడం ఆనవాయతీ.

3. శృంఖలాదేవి (పశ్చిమ బంగ )

విశృంఖలా స్వయం దేవీ – భక్తానుగ్రహకారిణీ
భక్తానాం శృంఖలా హర్త్రీ – స్వయంబద్దాకృపాపరా
శృంఖలాకటి బద్దా చ – జగన్మాతా యశస్వినీ
మాంగల్య దా శుభకరీ – వేదమార్గాను పాలినీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవి బుష్యశృంగ సమర్చితా
శుభం తనో తు సా దేవీ – కరుణాపూర వాహినీ!!

పశ్చిమ బంగ, హుగ్లీ జిల్లా, పాండువా గ్రామంలో శృంఖలాదేవి శక్తి పీఠం ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది 3వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం పడిందని చెబుతారు. శృంఖలా అంటే సంకెల అని అర్థం. మాతృమూర్తిగా, అప్పుడే ప్రసవించిన బాలింతరాలుగా, నడుము వద్ద ఉండే నడికట్టును శృంఖల అంటారు. అదేవిధంగా అప్పుడే ప్రసవించి, చంటి బిడ్డకు పాలిస్తున్నట్లుగా ఉండే అమ్మవారి రూపానికి శృంఖలానామం వచ్చిందంటారు. క్షేత్రంలోని మూర్తి మాతృప్రేమను ప్రతిబింబించేలా ఉంటుంది. సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలు ఒక్క బంగా(వంగ)లోనే పదికి పైగా ఉన్నట్లు స్థానికుల వాదన. పైగా మొదటినుంచీ వంగలో శక్తి ఆరాధన అధికం అనడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. వంగలో శక్తిగుడిలేని గ్రామం అంటూ ఏదీ లేదని చెప్పొచ్చు. అంగ, వంగ కళింగ దేశాలు మూడు శక్తి ఆరాధనకు ప్రసిద్ధి చెందినవే! ఎన్ని ఆలయాలు ఉన్నా…శృంఖలాదేవి శక్తిపీఠంగా ప్రజలు విశ్వసిస్తున్నారు.

4. చాముండేశ్వరి ( మైసూరు )

మహిషం సంహృత్యదేవి కంటకం త్రిషు జన్మసు
చండీ కాళీ స్వరూపేణ దుర్గా రూపేణ శాంకరి!
స్థితాసి లోక రక్షార్ధం చాముండా క్రౌంచపట్టణే
దేవి త్వం ప్రసీదాస్మాన్‌ సర్వదా సర్వదా శుభే!!

భారత ఉప ఖండంలో వెలసిన అష్టాదశ శక్తి పీఠాల్లో చాముండేశ్వరి ఆలయాన్ని 4వ శక్తి పీఠంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారి కేశాలు పడ్డాయంటారు. మైసూరు, చాముండి కొండల్లో వెలసిన చాముండిదేవికి ఈ దసరా పర్వ దినాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. కర్ణాటక, మైసూరులో ప్రస్తుతం మనకు తెలిసిన చాముండి కొండను ఒకప్పుడు మహాబల గిరిగా పిలిచేవారు. 1659 వరకు అతితక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూరును పాలించిన దొడ్డ దేవరాజ ఒడెయార్‌ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూరు రాజ వంశస్థుల కులదేవతగా, మైసూరుకు నాడ దేవత(గ్రామ దేవత)గా చాముండి దేవి నిత్య పూజలు అందుకుంటోంది.

ఏటా మైసూరు మహారాజు వంశస్థులతోపాటు, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి. కాళికాదేవి ప్రతిరూపంగా ఉండే చాముండి దేవి తామస గుణ వదనంతో కనిపిస్తుంది. అష్టకరముల్లో ఆయుధాలను ధరించిన దేవిని చంపక పుష్పాలతో అలంకరిస్తారు. ఈ నవరాత్రులలో రోజు సాయంత్రం మహారాజుల కుటుంబ సభ్యులు అత్యంత నిష్టగా పూజలు చేస్తారు.

5. జోగులాంబ ( అలంపూర్‌ )

అలంపురం మహాక్షేత్రం- తుంగాచోత్తర వాహినీ!
బాల బ్రహ్మేశ్వరో దేవః – జోగులాంబా సమన్వితః!!
తీర్థం పరుశురామస్య- నవ బ్రహ్మ సమన్వితం!
అలంపురే జోగులాంబా- విశాలాక్ష్యా సమాస్మృతా!!
భువికా శ్యా సమక్షేత్రం- సర్వదేవ సమర్చితం!
సదానఃపాతు సా దేవీ- లోకానుగ్రహ తత్పరా!!

సతీదేవి ఊర్ధ్వ దంత భాగం పడిన చోటే అలంపూర్‌. ఈ ప్రాంతంలోనే అమ్మవారు జోగులాంబగా అవతరించింది. ఇది ఐదోశక్తి పీఠం. ఈ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉండేది. ప్రత్యేక తెలంగాణ విభజించిన అనంతరం ఆ జిల్లా విడిపోవడం, అమ్మవారి పేరే కొత్త జిల్లాకు పెట్టారు. ఇది తెలంగాణాలో ఏకైక శక్తిపీఠం. ఇప్పుడు అలంపూర్‌ జోగులాంబ జిల్లాలో ఉంది. ప్రధానంగా నరఘోష, దృష్టి దోషం కలగకుండా అమ్మ ఆదర్శమూర్తిగా దర్శనం ఇస్తుంది. అత్యంత శక్తిమంతురాలిగా జోగులాంబని అభివర్ణిస్తారు. అమ్మవారు పీఠాసన రూపంలో మహాతేజోవంతమై దర్శనమిస్తుండటం విశేషం. అమ్మవారి కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. అలంపూర్‌ జోగులాంబ దర్శనం భక్తులకు మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తుంది.

14వ శతాబ్దంలో బహమని సుల్తాన్‌ కాలంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం కావడంతో అమ్మవారి మూల విగ్రహాన్ని స్వామి వారి ఆలయంలో నైరుతి భాగంలో ఏర్పాటు చేశారు. తరువాత 2005లో మళ్లీ అమ్మవారి ఆలయాన్ని పునః నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేశారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. అందుకే అమ్మవారి పీఠం అడుగున జలగుండం ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి వారోత్సవ పూజలు… అమావాస్య, పౌర్ణమికి చండీహోమాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. దసరా పండగనాడు తుంగభద్ర నదిలో పెద్దఎత్తున తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది.

6. భ్రమరాంబిక ( శ్రీశైలం )

భ్రమరై రరుణం హత్వా భ్రామ్యన్తీ శ్రీగిరౌ స్థితా
భక్తాను కంపినీ దేవీ మల్లికార్జున తోషిణీ సుందరీ !!
శివనుగ్రహ సంధాత్రీ భక్తరక్షణ తత్పరా
సానః పాయాత్‌ సదా మాతా శ్రీశైలే భ్రమరాంబికా!!
సతీదేవి మెడభాగం పడిన ప్రాంతమే శ్రీశైలం. ఈ మహాక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన భ్రమరాంబాదేవి పద్దెనిమిది మహాశక్తుల్లో ఒకరు. ఈ అమ్మవారి క్షేత్రం ఆరో శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. అరుణాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారు తుమ్మెద రూపంలో అవతారమెత్తింది. దాంతో అమ్మవారికి భ్రామరీశక్తిగా పేరు వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక అరుణాసురుడి సంహారం తరువాత అమ్మవారు భక్తులను అనుగ్రహించడానికి, భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. ఆ సమయంలో సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతుండగానే, అద్భుతమైన మల్లె పొదల వాసన ఆమెను (తుమ్మెద రూపంలో ఉన్న ఆ దేవతను) ఆకర్షించింది.

అక్కడ మల్లికార్జునరూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని గుర్తించింది. ఇక అక్కడే ఉండిపోదలచి, ఆ లింగానికి పశ్చిమాన కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరనివాసం ఏర్పరచుకుంది. అందుకే ఆ అంశని ‘భ్రమరాంబ’గా రుషులు, దేవతలు స్తుతించారు. అలా శ్రీశైల మహాక్షేత్రంలో అమ్మవారు శ్రీ మల్లికార్జున స్వామికి ఇల్లాలై భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడ నిత్యం అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. దసరా సమయంలో నిత్యాభిషేకాలు, హోమాలు ఉంటాయి. శరన్నవరాత్రుల్లో రోజుకో అలంకారంతో పూజలు అందుకుంటుంది భ్రమరాంబికా దేవి. శ్రీశైల క్షేత్రంలో నిత్యం అమ్మవారికీ, స్వామికీ కల్యాణం జరుగుతుంది.

7. మహాలక్ష్మి ( కొల్హాపురి )

శ్లో: కోల్హతపః ప్రీతాదేవీ వరదాన మహోజ్జ్వలా
మహాలక్ష్మీర్మహామాతా లోకానుగ్రహ కారిణీ!
దత్తాత్రేయాది సుప్రీతా నానాతీర్థ నిషేవితా
కరవీర సుమారాధ్యా కోల్హ సద్గతిదాయినీ!
భవానీ చామలాదేవీ కరవీర సువాసినీ
కొల్హాపురే మహాలక్ష్మీర్మమాస్తు శుభదాయినీ!!

శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మీ ఆలయం, మహారాష్ట్ర, కొల్హాపూరులో ఉంది. క్రీస్తు శకం 600-700 సంవత్సరాల మధ్య చాళుక్యుల నాటి కాలంలో ఏడవ శతాబ్దంలో పంచగంగా నది ఒడ్డున నిర్మించిన ఆలయమిది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి రూపంలో కొలువై ఉంటుంది. ఇది ఏడో శక్తిపీఠం. సతీదేవి కళ్లు ఇక్కడ పడ్డాయని అంటారు. అమ్మవారు విష్ణుమూర్తి సమేతంగా దర్శనమిస్తుంది. ఈ శక్తిపీఠానికి కొల్హాపూర్‌తోపాటు కరవీరం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ఎన్నో తీర్థ ఘట్టాలు, దేవతా ప్రతిష్టలు ఉన్నాయి. దత్తాత్రేయ మహర్షి ప్రతిరోజూ అ అమ్మవారి వద్ద భిక్ష స్వీకరించేవాడని చెబుతారు. వింధ్య పర్వత గర్వాన్ని అణచిన అగస్త్యమహర్షి తిరిగి ఉత్తరాపధం వెళ్లకుండా దక్షిణాదిన సంచరిస్తూ ఇక్కడే శ్రీమహాలక్ష్మి సాక్షాత్కారం పొందినట్లు చరిత్రలో ఉంది.

గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. ప్రతిరోజూ అమ్మవారి పాదముద్రలకు కుంకుమార్చన చేస్తారు. అలాగే ఈ పూజలన్నింటినీ పురుషులతోనే చేయిస్తారు. ఏ ఆలయమైనా తూర్పు ముఖంగానే నిర్మించి ఉండటం సహజం. కానీ ఈ ఆలయం మాత్రం పశ్చిమముఖంగా ఉంటుంది. అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. పైన ఉన్న కుడిచేతిలో పెద్ద గద, మరో చేతిలో మాదీఫలం, ఎడమచేతిలో డాలు, మరో చేతిలో పానపాత్ర ఉంటాయి.

8. ఏకవీరికాదేవి (మహారాష్ట్ర)

శ్లో: దత్తాత్రేయ సమారాఢ్యా అనసూయాత్రి సేవితా
ఏకవీరా మహాదేవీ మస్తకే నైవ శోభినీ!
రేణుకా మాతా మాయా సంహార రూపిణీ
కృపయా పాతు నస్సర్వాన్‌ మాయూరే ఏకవీర్యకా!!

అష్టాదశ శక్తి పీఠాల్లో ఏకవీరికా దేవి ఆలయం ఎనిమిదో శక్తిపీఠం. దత్తాత్రేయస్వామి జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన మాహోర్‌ క్షేత్రం మహారాష్ట్రలో ఉంది. నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో ఈ శక్తిపీఠ క్షేత్రం ఉంది. ఏకవీరికా ఆలయం వల్ల శక్తిపీఠంగా గుర్తించారు. ఈ ప్రదేశంలో మూడు కొండ శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరంపై అత్రి-అనసూయలు, మరో శిఖరంపై దత్తాత్రేయస్వామి నెలకొని ఉండగా – మూడో శిఖరంపైన ఏకవీరికాదేవి విగ్రహం ఉంది. ఈ అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. ఈ శక్తిపీఠ క్షేత్రంలో సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు. కేవలం తల మాత్రమే ఇక్కడ శక్తిగా ఆరాధించబడుతోంది. మెడ కూడా ఉండదు. పైగా ఈ ముఖం రౌద్రం మరింత పెరుగుతోందా అన్నట్లుగా గంగ సింధూరం పూత పూస్తారు. ఈ అమ్మవారిని తుల్జాపూర్‌ భవానీ అని కూడా పిలుస్తారు. ఈ మాతను శివాజీ చక్రవర్తి ఆరాధించాడని ప్రతీతి. ఈ అమ్మవారికి కొంతకాలం వరకూ జంతువుల్ని బలిచ్చేవారు. ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును, పక్కన గల గోడలను తాకేటంత పెద్దదిగా ఉండటం ఈ క్షేత్రంలో చూడొచ్చు. మహామంత్ర శక్తి గల అమ్మవారని ప్రసిద్ధి.

9.మహంకాళీ (ఉజ్జయినీ)

శ్లో: త్రిపురాసుర సంహర్తా మహాకాలో త్రవర్తతే
యస్యాట్ట హాస సందగ్థం దుస్సహం తత్‌ పురత్రయమ్‌!
పురీసాస్యాదుజ్జయినీ మహాకాళీ చ సామతా
ఉజ్జయిన్యం మహాకాళీ భక్తానామిష్టదాసదా !!

అష్టాదశ శక్తిపీఠాల్లోని తొమ్మిదో శక్తిపీఠం ఉజ్జయినీ మహంకాళి. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లో ఉంది. హరసిద్ధిమాత, అన్నపూర్ణాదేవితో కలిసి అమ్మవారిని సేవించే చోటు ఇదే. సప్తమోక్ష పురాలలో ఇదొకటి. అమ్మవారు మహాకాళి కాగా, అయ్యవారు మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగమూర్తి. సతీదేవి పై పెదవి ఇక్కడ పడినట్లు చెబుతారు. ఎక్కడైతే మహాకాళి ప్రకాశిస్తుందో ఆ పురమే అవంతిక (రక్షించేది), ఉజ్జయిని (జయించేది), అదే (యజ్ఞాలకు యోగ్యమైన) కుశస్థలి. ఇవన్నీ ఉజ్జయినీ నగరానికి మారుపేర్లు. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని అంటారు. మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించిన శక్తి ఈ కాళీమాతే.

నగరానికి కొద్ది దూరంలో క్షిప్ర/సిప్ర, ఖాన, సరస్వతి నదుల సంగమం ఉంది. ఇక్కడ ఇదే త్రివేణి సంగమ స్థలం. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగాన్ని ఎవరికి వారే అభిషేకించే అవకాశం ఉంది. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. అయితే దేవీ నవరాత్రుల్లో జరిగే ఉత్సవాలు మాత్రం భారీస్థాయిలో ఉంటాయి.

10.పురూహూతికా దేవి ( పిఠాపురం )

శ్లో: ఏలర్షి పూజిత శ్శంభుః- తస్మై గంగా మదాత్‌ పురా
రురావ కుక్కుటో భూత్వా- భగవాన్‌ కుక్కుటేశ్వరః!!
దేవీ చాత్ర సమాయాతా- భర్తృ చిత్తానుసారిణీ
పురుహూత సమారాద్దా- పీఠాయాం పురుహూతికా!!

అమ్మవారి పిరుదు భాగం పడిన ప్రాంతం పిఠాపురం. ప్రసిద్ధ క్షేత్రాలన్నింటిలో ప్రత్యేకతగల ఆలయం పిఠాపురం పాదగయ క్షేత్రం. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో పిఠాపురం దశమ శక్తిపీఠం. దసరా సందర్భంగా అమ్మవారికి ఆలయంలో కుంకుమార్చనలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం. మహిళలు ఉపవాసంతో ఈ కుంకుమార్చన చేస్తారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పురూహుతికా అమ్మవారికి తొలిరోజు కలశస్థాపన, ప్రతిరోజు ఉదయం శ్రీచక్ర నవార్చన, ఛండీ సప్తపతి పారాయణ, మధ్యాహ్నం చండీ హోమం, సాయంత్రం లక్ష కుంకుమార్చన జరుగుతాయి. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి భవానీ దీక్ష చేపట్టిన భక్తులు 9 రోజులపాటు ఈ క్షేత్రంలోనే ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే శతచండీయాగం, కుంకుమ పూజలు ఇక్కడ ప్రత్యేకతం.

11.గిరిజదేవి ( జాజ్‌పూర్‌ ఒడిశా )

శ్లో: ఓఢ్యాణే గిరిజాదేవీ పిత్రర్చన ఫలప్రదా
బిరజా పర పర్యాయా స్థితా వైతరణీతటే
త్రిశక్తీనాం స్వరూపా చ లోకత్రాణ పరాయణా
నిత్యం భవతు సా దేవీ వరదా కులవర్థినీ

ఓఢ్యాణం అంటే… ఓఢ్రదేశం. నేటి ఒడిశా. కటక్‌కి దగ్గర్లోని వైతరణీ నదీతీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణే. జాజ్‌పూర్‌ రోడ్డుకు సుమారు 20 కి.మీ. దూరంలో ఉంది పదకొండో శక్తిపీఠం. అదే గిరిజాదేవి ఆలయం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశలతో కూడిన శక్తిపీఠంగా ఇక్కడి గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి, గిరిజాదేవి పాదాలను దూరం నుంచే అర్చిస్తూంటాడు. అంటే ఇక్కడికి సమీపంలో శ్వేతవరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉందని అర్థం! జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా? నరకానికి పంపాలా? అనే విషయాన్ని వైతరణీ నది తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది, న్యాయనిర్ణేత అన్నమాట. జాజ్‌పూర్‌ రోడ్డు చేరువలో ఉన్న ఈ వైతరణి ఆ నదీ అంశతో జన్మించింది కాబట్టి, పితృదేవతలకు – పిండ ప్రదానాలకు ఇది ప్రశస్తమైందని పురాణాలు వర్ణించాయి. అందుకే ఇక్కడ అంతా పిండ ప్రధానం చేస్తారు. స్థానికులు ఇక్కడి శక్తి పీఠాన్ని బిరజాదేవి అనీ వ్యవహరిస్తున్నారు. వైతరణి లేదా విరజా నదీ తీరంలో వెలసినందున వంగ/ఒరియా భాషల్లో విరజ, బిరజగా మార్పుచెంది, స్థానికుల నోట బిరజగా రూపాంతరం చెంది ఉండొచ్చు. త్రిశక్తి రూపిణిగా పూజలందుకొంటూ ఉన్న ఇక్కడి అమ్మవారికి తలనీలాలు అర్పించడం అనేది ఒక విశేషమే!
క్షేత్ర విశిష్టత
ఇక్కడి అమ్మవారు (గిరిజ) సింహాన్ని వాహనంగా కలిగి, ఒక చేత్తో ఖడ్గం, మరో చేతితో మహిషాసురుని తోక పుచ్చుకున్నట్లుగా దర్శనం ఇస్తుంది. దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్రను జరుపుతారు. ఒడిశాలోని మరో పుణ్యక్షేత్రం పూరీలో కూడా రథయాత్రకు ప్రాముఖ్యం ఉంది. అదే తరహాలో ఈ దేవతకు కూడా రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహరూపుడైన విష్ణుమూర్తి ఆలయం నిర్మించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి కోల్‌కతా వెళ్లే రైలు మార్గంలో, కటక్‌ నుంచి మూడు గంటల బస్సు ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చు.

12.మాణిక్యాంబ ( ద్రాక్షారామ )

శ్లో: స్వయం భూరస్తి భీమేశః మాణిక్యాంబా త ధైవచ
సప్తర్షి భి స్సమానీతం సప్తగోదావరం శుభం
సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః
భక్త్త రక్షణ సంవ్యగ్రా మాణిక్యా దక్ష వాటికే!!

సతీదేవి నాభిభాగం పడిన చోటే ద్రాక్షారామ. సంస్కృతంలో నాభిని మణిపూర్వకచక్రం అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబగా అవతరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్రాక్షారామ అష్టాదశ పీఠాల్లో ఒకటిగానే కాకుండా శ్రీశైల భ్రమరాంబ, కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, ద్రాక్షారామ మాణిక్యాంబలను కలిపి అంబికాత్రయంగా చెబుతారు. దాక్షాయని ఆత్మాహుతి చేసుకొన్న ఇక్కడే పరమేశ్వరుడు భీమేశ్వరుడి రూపంలో స్వయంభువుడై వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది. ద్రాక్షారామలో మాణిక్యాంబ అమ్మవారు దక్షిణాభిముఖంగా సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రంపై ఉంటుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ రూపాన్ని పునఃప్రతిష్ఠించించారు. అష్టాదశ పీఠాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు శ్రీచక్రంపై నిలబడి ఉంటుంది. శ్రీచక్రానికి ఏకకాలంలో పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన రూప అలంకరణలు ఉండవు. దసరా శరన్నవరాత్రుల్లో ప్రతిరోజూ ప్రదోష కాలంలో ప్రత్యేకంగా రజిత, సువర్ణ, విశేష పుష్పార్చనలు నిర్వహిస్తారు. అనంతరం పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ చేరుకోవడానికి రైలుమార్గం ద్వారా అయితే రాజమహేంద్రవరం, సామర్లకోటలో దిగి బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రాజమహేంద్రవరం నుంచి 60 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.

13.కామాఖ్యాదేవి ( గువహటి )

కామాఖ్యే కామదే దేవి – నీలాచల నివాసిని
కామస్య సర్వదే మాతః – మాతృ సప్తక సేవితే!!
జామదగ్న్యస్య రామస్య మాతృహత్యా విమోచని
పంచ శంకర సంస్థానా భక్తపాలన తత్పరా !!
కల్యాణ దాయినీ మాతా విప్ర దర్శిత నర్తనా
హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా భవ సర్వదా !!

ఇది అసోం రాష్ట్రంలోని గువహటిలో ఉంది. సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అయ్యాక, అమ్మవారి యోనిభాగం ఇక్కడ పడిందని అంటారు. ఇది పదమూడో శక్తిపీఠం. కామాఖ్యదేవి అనేక మహిమలు చూపిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ ఆలయ సమీపంలోనే ఊర్వశీ (ఊర్చసి) కుండం ఉంది. ఈ కుండంలో స్నానం చేసిన తరువాతే ఆలయంలో ప్రవేశించాలి.
ఇక్కడ ఆలయం కిందకు ఉంటుంది. మెట్లు దిగి వెళ్లాలి. కామాఖ్య పీఠ దర్శనం చేసి, అక్కడి జలధారను తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు ప్రతీ ఏటా రజస్వల అవుతుంది. ఆ సమయంలో ఈ పీఠంలోని జలధార ఎర్రగా మారుతుంది. ఈ సమయాన్ని ‘అంబుబాషిమేళ’ అంటారు. ఈ కాలంలో మూడు రోజులపాటు అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని ఇతర ఆలయాలను మూసివేస్తారు. అమ్మవారికున్న వస్త్రాలు కూడా ఎర్రగా మారతాయంటారు. నాలుగో రోజు అమ్మవారికి శిరః స్నానం చేయించి ఆలయాలు తెరుస్తారు. భక్తులు మాత్రం అమ్మవారిని కామేశ్వరి అని కూడా పిలుస్తారు. మహా త్రిపుర సుందరిగా పరిగణిస్తారు. దసరా సమయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.

14.మాధవేశ్వరి ( ప్రయాగ (అలహాబాద్‌) )

త్రివేణీ సంగమోద్భుతా- త్రిశక్తీ నాం సమాహృతిః
ప్రజాపతి కృతా శేష – యాగమాలాభివందితా!!
బృహస్పతి కరాంత స్థ- పీయూష పరిషేచితా
ప్రయాగే మాధవీదేవీ – సదా పాయాత్‌ శుభాకృతి!!

సతీదేవి కుడిచేతి నాలుగు వేళ్లు ప్రయాగ (అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్లు చెబుతారు. అక్కడే మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం వెలసింది. ఇది పద్నాలుగో శక్తిపీఠం. ఈ క్షేత్రంలోని గంగానది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉంటే, యమున నీరు మాత్రం నల్లగా ఉంటుంది. యమున విష్ణు భక్తురాలు. విష్ణుపాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక, దీనికి మాధవక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కారణంతోనే ఈ శక్తిపీఠాన్ని మాధవేశ్వరీ పీఠంగానూ పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బింధుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ, సూర్యుడు అమ్మవారిని ఆరాధించే క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రమనీ కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మూడు అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పులో నలుచదరంగా ఉన్న ఒక పీఠం మాత్రమే కనిపిస్తుంది. ఆ పీఠం మధ్యలో గుంట ఉంటుంది. అక్కడే అమ్మవారి చేతి వేళ్లు పడిన చోటు అని చెబుతారు పురోహితులు. దాన్ని ముట్టుకుంటే చేతికి తడి తగులుతుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి అడుగున ఊయల మాదిరి కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్లు తృప్తి చెందుతారు. కానుకలను ఊయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంది.

15.వైష్ణవీదేవి ( కాంగ్రా హిమాచల్‌ప్రదేశ్‌ )

కాలాధర సర్వతాగ్రే జ్వాలా రూపాను భాససే
జ్వాలాముఖీతి విఖ్యాతా జ్యోతి ర్మూర్తినిదర్శనా!!
రాధే శ్యామేతి నా దేన వర్థమానా త్విషాంతతిః
జ్వాలాయాం వైష్ణవీ దేవి సదారక్షతు శాంకరీ!!

ఈ జ్వాలాక్షేత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా వద్ద ఉంది. అమ్మవారి నాలుక నిట్టనిలువుగా ఈ ప్రాంతంలో పడిందని ప్రతీతి. ఈ ఆలయం కాలంజర పర్వతంపై ఉంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. జ్వాలారూపిణిగా దర్శనం ఇస్తుంది. అమ్మవారి ఆలయం గుహలో ఉంటుంది. ప్రవేశద్వారానికి ఎదురుగా మూడు అడుగుల ఎత్తున్న గూట్లో ఆరు అంగుళాల పొడవున అగ్ని జ్వాల కనిపిస్తుంది. దాన్నే అమ్మవారి శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ నిరంతరం ఏడు జ్వాలలు వెలుగుతూంటాయి. ఇక్కడ అమ్మవారిని జ్వాలాముఖి, వైష్ణవీదేవి, విద్యేశ్వరీ దేవి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ గర్భాలయానికి రెండు అడుగుల చదరం ఆకృతిలో ఒక ప్రవేశ ద్వారం ఉంది. దీనిలోంచి తల మాత్రం దూర్చి ఆ జ్వాలను చూడొచ్చు. రాధేశ్యాం అని మనం ఎంత బిగ్గరగా అరిస్తే అంత ఎత్తున జ్వాల ఎగిసిపడటం ఇక్కడి ప్రత్యేకత. ఇది పదిహేనో శక్తిపీఠం.

16.సర్వమంగళాదేవి ( గయ )

గదాధర సహదోరి గయాగౌరి నమోస్తుతే
పితృణాంచ స కర్తృణాం దేవి సద్గతిదాయిని!!
త్రి శక్తి రూపిణీ మాతా సచ్చిదానంద రూపిణీ
మహ్యం భవతు సుప్రీతా గయా మాంగళ్య గౌరికా!!

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరి దేవీ… స్థలపురాణానికి తగ్గట్లుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా పిలుస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. సర్వమంగళాలను దేవి ప్రసాదించడంతో, ఈ తేజోమూర్తిని దేవతలు, మునులు సర్వమంగళాదేవిగా కీర్తించారు. ఈ క్షేత్రంలో శ్వేత, మధుర, ఫల్గుణి అనే మూడు నదులు సంగమిస్తూ ఉండటంతో ఈ క్షేత్రానికి ప్రయాగతో సమానమైన ఖ్యాతి ఉంది. ప్రస్తుతం మధుర, శ్వేతానదులు కనిపిస్తున్నాయి. ఫల్గుణీ నది అంతర్థానమై అంతర్వాహిని మారిపోయింది. ఈ శక్తి పీఠంలో యాభైరకాల దానాలతో కూడిన శ్రాద్ధకర్మలు చేస్తారు. ఇది వైష్ణవక్షేత్రం కూడా. మంగళగౌరీ దేవిని విష్ణు మూర్తి భక్తులు చెల్లెలుగా పరిగణిస్తారు. ఇది పదహారో శక్తిపీఠం.

17. విశాలాక్షీ (కాశీ)

కాశీంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
విశ్వేశం దేవ మాలోక్య ప్రీతి విస్తారితే క్షణా!!
సానురాగా చ సా గౌరీ దద్యాత్‌ శుభపరంపరాం
వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణా పరాకృతిః!!
అన్నం జ్ఞాన చ దదతీ సర్వాన్‌ రక్షతి నిత్యశః
త్వత్ప్ర సాదా న్మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే!!
అష్టాదశ శక్తిపీఠాల్లో పదిహేడో శక్తిపీఠం శ్రీవిశాలాక్షీ దేవి. కాశీ విశ్వేశ్వరుడి గుడికి కొంత దూరంలోనే విశాలాక్షీ అమ్మవారి క్షేత్రం ఉంది. ఈ గుడి గోపురం అంతా దక్షిణాది సంప్రదాయంలో ఉంటుంది. సప్తమోక్ష పురాణాల్లో ఒకటిగా కాశీకి విశిష్టస్థానం ఉంది. ఇది సతీదేవి మణికర్ణిక (చెవి కుండలం) పడిన ప్రదేశం. ఆలయం బయటి నుంచి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. కానీ ఈ శక్తి పీఠంలోని విశాలాక్షీ అమ్మవారు గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకటి పెద్దది. మరొకటి చిన్నది. వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైంది. స్వయంభువు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షీ అనే పేరు వచ్చిందని ప్రతీతి.

18. సరస్వతి ( కశ్మీరు )

సరస్వతి నమస్తుభ్యం సర్వవిద్యాస్వరూపిణి
రాగద్వేషాది యుక్తాయ మనశ్శాంతిం ప్రయచ్ఛసి!!
కాశ్మీర దేశ వద్రమ్యా విశదా భవదా కృతిః
సాంత్వయన్తీ మహాదేవీం త దుక్త్యా శారికా అభూః!!
ప్రసన్నతాం సమాంబుద్ధిం విశదాం పాండితీం శుభాం
విద్యా వృద్ధిం సదా దద్యాత్‌ కాశ్మీరే షు సరస్వతీ!!

సరస్వతీదేవిని కశ్మీరు పురవాసినిగా పిలుస్తారు. అక్కడి ప్రజలు ‘‘నమస్తే శారదా దేవీ కశ్మీరు పురవాసినీ-త్వాం హం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే’ అని భక్తితో పూజిస్తారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫ్ఫరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో నీలం నది పక్కన శారద అనే గ్రామంలో ఈ శక్తి పీఠం ఉంది. సతీదేవి కుడిచేయి ఇక్కడ పడటం వల్ల ఈ పీఠం ఏర్పడిందని చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చాలాసార్లు శిథిలమైంది. పందొమ్మిదో శతాబ్దంలో కశ్మీర్‌ రాజు మహారాజా గులాబీసింగ్‌ ఈ ఆలయాన్ని చివరిసారిగా మరమ్మతులు చేయించారు.

1948లో భారత్‌ పాకిస్థాన్‌ యుద్ధంతో ఈ ప్రాంతం ఫస్తూన్‌ తెగల ఆక్రమణకు గురై వాళ్ల ఆధీనంలో ఉండిపోయింది. ఆపై ఆక్రమిత కశ్మీర్‌ వశంలోకి చేరింది. మరోసారి 2005లో జరిగిన అతిపెద్ద భూకంపంతో చాలా భాగం శిథిలమైపోయింది. అప్పటి నుంచి ఈ ఆలయానికి మరమ్మతులు లేవు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తోంది. అప్పుడప్పుడు పాకిస్థానీ హిందువులు దేవాలయాన్ని సందర్శిస్తారు. అలానే జమ్మూ కశ్మీరులో అమ్మవారిని కీర్‌ భవాని సరస్వతి శక్తి పీఠంగా భావిస్తారు చాలామంది. ఇది తుళుముల అనే ప్రదేశంలో (శ్రీనగర్‌కు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో) ఒక చెరువు మధ్యలో ఉంది. పాలతో చేసిన అన్నం పాయసం ఇక్కడ ప్రసాదం !!!