శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వేములవాడ

 శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వేములవాడ

rajarajeshwaratemple-freshgaవేములవాడ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణం మరియు పుణ్య క్షేత్రం. వేములవాడ పట్టణం జిల్లా ముఖ్య పట్టణం అయిన కరీంనగర్ నుండి 32 కి. మీ. దూరంలో, కరీంనగర్ నుండి కామారెడ్డి కి వెళ్లే దారిలో కలదు.

చరిత్ర :-   వేములవాడ ప్రదేశం పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉందని ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. అంతే కాక పురాతన భీమన్న ఆలయం, పోచమ్మ ఆలయం తో పాటుగా సమీపంలో ట్రెక్కింగ్ ప్రదేశం ఎలగందల్ కోట కూడా కలదు.

చూడవలసిన కొన్ని ఆహ్లాద ప్రదేశాలు :-  రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడ వచ్చే భక్తులు ప్రముఖంగా చూడవలసినది రాజరాజేశ్వర స్వామి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఆదాయం కల ఆలయాలలో ఇది ఒకటి. కాశీ, చిదంబరం, శ్రీశైలం మరియు కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ కి వచ్చాడని పురాణ కథనం.

రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రధాన దేవాలయమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారామ చంద్రస్వామి, అనంత పద్మనాభస్వామి, త్రిపురసుందరి, కేదార, దక్షిణామ్తూరి, బాలరాజేశ్వరస్వామి దేవాలయాలున్నాయి. గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహల్‌, నాగిరెడ్డి మండపం, ఆలయ భోజనశాల, ఆలయ పరిపాలనా భవనం ప్రధానాలయానికి అనుబంధంగా వున్నాయి.

రాజరాజేశ్వర స్వామి ఆలయ విశిష్టత రాజరాజేశ్వర ఆలయంలో కొలువైన స్వామిని రాజరాజేశ్వర స్వామి అని, రాజన్న అని అంటుంటారు. ఇక్కడి మూలవిరాట్టుకి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీలక్ష్మి సహిత సిద్ధి వినాయకుని విగ్రహాలు ఉన్నాయి.
githa-pradakshna-freshga

పూజలు :- రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.

శివరాత్రి సమయంలో సుమారు వంద మంది అర్చకులతో మూలవిరాట్టుకి మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేల శివునికి ఏక రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుద్దీప కాంతులతో దేదివ్య మానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది.

dharmagundam-freshga
ధర్మ గుండం కోనేరు రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం లో ఉన్నది. ఈ కోనేరు లో భక్తులు స్నానాలు ఆచరించి తమ ఇష్ట దైవాన్ణి దర్శించుకుంటారు. ఈ కోనేటి పై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య మండపం పై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్టించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.

దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉన్నది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్లో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.

వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.

శివరాత్రి పర్వదినాన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో సుమారు మూడు లక్షల మందికి పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు.

వేములవాడ లో అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం లో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు.

వేములవాడకి 2 కి. మీ .దూరంలో ఉన్న నాంపల్లి గుట్ట లో ఆసక్తికలిగించే లక్ష్మి నరసింహ స్వామి ఆలయం ఉన్నది. ఇది ఒక చిన్న గుడి. ఇది ఒక కొండమీద వేములవాడ నుండి కరీంనగర్ కి వెళ్లే మార్గంలో కలదు. వేములవాడ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో వెళ్లే వారు ఈ ఆలయాన్ని తప్పక సందర్శిస్తారు.

వేములవాడ లోని భీమన్న ఆలయానికి సమీపంలో పోచమ్మ ఆలయం ఉన్నది. ఈ ఆలయం బద్ది పోచమ్మ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఆలయంలో భక్తులు తమ కోర్కెలను కోడి, మేక వంటి జంతువులను అమ్మవారికి బలి ఇచ్చి తీర్చుకుంటారు.

వసతి:- వేములవాడ పట్టణంలో భక్తులకి, పర్యాటకులకి ఎటువంటి అ సౌ కార్యం కలగకుండా, వారికి తగినన్ని ఏర్పాట్లను దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వసతికై సత్రాలు, లాడ్జీ లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పెద్ద పెద్ద హోటళ్ళలో ఉండాలనుకొనేవారు 32 కి. మీ. దూరంలో ఉన్న జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్‌లో బస చేయవచ్చు.
భోజనం వేములవాడ పుణ్య క్షేత్రం లో ఆలయానికి దగ్గర్లో తగినన్ని హోటళ్లు, రెస్టారెంట్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు సరసమైన ధరకే ఇడ్లీ, దోశె, పూరీ, వడ వంటి అల్పాహారాలు మరియు అన్నం,సాంబార్, రసం, పెరుగు వంటి ఆంధ్రా భోజనం లభిస్తాయి.

షాపింగ్ వేములవాడ క్షేత్రంలో దివ్య గ్రంధాలు, పిల్లల ఆట వస్తువులు, కొయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు ఇంకా చేతితో అల్లిన వస్తువులు, పూజా సామాగ్రి వంటివి లభిస్తాయి.

ఎలా చేరుకోవాలి ?? :- వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్ లేదు. కేవలం హైదరాబాద్ నుండి ప్రతిరోజు పరిమిత సమయంలో మాత్రమే బస్సులు ఉన్నాయి. ప్రయాణ సమయం ప్రభుత్వ బస్సులో అయితే 4 గంటల 3 నిమిషాలు, అదే త్వరగా చేరుకోవాలంటే క్యాబ్ ద్వారా 2 గంటల 52 నిమిషాల సమయం పడుతుంది. విమాన మార్గం వేములవాడ లో ఎటువంటి విమానాశ్రయం లేదు. దీనికి సమీపంలో ( 205కి. మీ) గల విమానాశ్రయం హైదరాబాద్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి క్యాబ్ లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా వేములవాడ చేరుకోవచ్చు లేకుంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు వేములవాడ కి నడిచే బస్సులో ప్రయాణించవచ్చు. రైలు మార్గం వేములవాడ లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు కానీ, 67 కి. మీ. దూరంలో ఉన్న కామారెడ్డి రైల్వే స్టేషన్ దీనికి సమీపంలో గల రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి గా ఉన్నది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, పూణే, భోపాల్ వంటి నగరాలకు ప్రయాణించవచ్చు. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గల ఒక ప్రధాన రైలు కూడలి. రోడ్డు మార్గం హైదరాబాద్ నగరానికి సుమారు 150 కి. మీ .దూరంలో ఉన్న వేములవాడకి ప్రతిరోజు ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి. అదే విధంగా 32 కి. మీ. దూరంలో ఉన్న జిల్లా ముఖ్య పట్టణం కరీంనగర్ నుండి కూడా ప్రతిరోజు అరగంటకోసారి ప్రభుత్వ బస్సులు నడుపుతుంటారు ఆర్టీసీ అధికారులు.