భాష– భావము

భాష-భావం విడదీయలేనివి. భాషకి భావం తోడైన కవితలు, కావ్యాలు సజీవం, భావము లేక భాష ఒక్కటే ఉన్న కావ్యం నిర్జీవం. తీయ్యని, కమ్మని వాక్యాలలో జీవం నింపును భావాలు, భాష, భావం జోడు కూడిన నవరస కవితలు విలసిల్లును, అన్నారు కవులు.

అదేవిధంగా, మనిషి మనుగడకు భాష చాలా ముఖ్యం. భాష, భావ యుక్తమై ఉంటుంది, ఉండాలి. భావము లేని భాష నిర్జీవం. భాష గొప్పతనం ఈ క్రింది శ్లోకంలో వేల సంవత్సరాల క్రితం ఎలా పొందుపరిచారో చూడండి.

కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః ।
వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥

భావము: బంగారు ఆభరణాలు, ముత్యాలు, హారాలు అలంకారాలు కాదు. పూల మాలలు, పరిమళ ద్రవ్యాలు, సుగంధ లేపనస్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలు మనిషికి సిసలైన అలంకారాలు. ఇతరములైన అలంకరణములు ఏవియు సరికావు అవన్నీ తాత్కాలికమే. నిత్యమైనది, నాశనం లేనిది, జ్ఞానముతో అలారారు సమయానుకూలమైన వాక్కు మాత్రమే శాశ్వత అలంకరణ.

వాక్ ఒక అలంకారం, ఒక భూషణం కనుక మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అని పెద్దలు చెబుతుంటారు. శ్రీకృష్ణ రాయబారం, సంజయ రాయబారం, సుందరాకాండ లో హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారి జాడ గురించి తెలిపిన విధానం. మనకు ఆదర్శప్రాయం, అనుసరణీయం.

రామాయణంలో ఆంజనేయుని పాత్ర కూడా ఇలానే ఉంటుంది. ఆంజనేయుడు శబ్ద బ్రహ్మ ఆయన భాష అవిస్తరం, అవలంబితం అసందిగ్ధం, ఆవృతం అన్ని కలిపి కలబోసినట్లు ఉంటుంది. లంకలో సీతమ్మ వారిని చూసి వచ్చిన హనుమ, తన తాతగారైన జాంబవంతునితో తాను చేసిన వీరంగం గురించి తన ప్రతాపం గురించి వివరించాడు. అదే హనుమ, శ్రీరామచంద్రమూర్తి వద్ద తాను లంకలో వృక్షఛాయలో దిగులుతో ఉన్న సీతమ్మను చూశాను అని మాత్రమే చెప్పాడు.

మహాకవి కాళిదాసు ‘రఘువంశం’ అనే కావ్యంలో వాక్కు అర్థం వివరిస్తూ ఈ క్రింది విధంగా తెలిపెను.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే ।
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ॥

వాక్కు- అర్థం, పార్వతీపరమేశ్వరుల వలె కలిసి ఉండాలి.

సూచన :
జి. ఆర్. కె. మూర్తి