శనివారం సాయంత్రం ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో పాన్ కోసం ఓ కరోనా రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతనికి పాన్ అంటే ఇష్టం. పాన్ లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన డ్రస్సును ధరించి ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు.
లాక్ డౌన్ కారణంగా ఆస్పత్రి పరిసరాల్లో ఎలాంటి షాపులు తెరవలేదు. దీంతో ఆ కరోనా రోగి గాంధీ నగర్ వెళ్లాడు. అక్కడ ఓ షాపులో పాన్ తీసుకుని తిన్నాడు. అనంతరం అక్కడున్న తన బంధువుల ఇంటికెళ్లి.. తనను ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించండి అని కోరాడు. చేసేదేమీ లేక వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి పోలీసులు, వైద్యులు అతన్ని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించారు.