నెలసరి నొప్పులకు చెక్!

మహిళల్లో నెలసరి వచ్చిందంటే చాలు నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి వంటి రకరకాల శారీరక సమస్యలతోపాటు అలసట, చిరాకు లాంటి మానసిక సమస్యలు వేధిస్తాయి. అయితే నెలసరి సమయంలో వేదించే నొప్పుల్ని తాము రూపొందించిన న్యాచురల్ రోల్ఆన్ తో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు ఢిల్లీకి చెందిన ఇద్దరు ఐఐటి విద్యార్థులు. అర్చిత్ అగర్వాల్, హ్యరి నెహ్రవత్ అనే ఇద్దరు ఢిల్లీ – ఐఐటీ విద్యార్థులు దాదాపు ఏడు నెలల పాటు కష్టపడి ఈ నొప్పి నివారిణి తయారు చేశారు. దీన్ని యూకలిప్టస్, మెంథాల్, వింటల్ గ్రీన్ వంటి నూనెల్ని ఉపయోగించి తయారుచేస్తారు. దీని ధర 169 రూపాయలు. ఇది వందశాతం సహజసిద్ధమైనది. 10 ఎం.ఎల్ Sanfe రోల్ఆన్ ను దాదాపు మూడు పర్యాయాలు ఉపయోగించుకోవచ్చు. నొప్పి ఉన్న చోట ఈ నూనె రాసుకోవడం వలన సత్వరమే నొప్పి మాయమవుతుంది. దాదాపు ఎనిమిది గంటల పాటు నొప్పి పై దీని ప్రభావం పనిచేస్తుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్‌)లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ మందును 14 నుంచి 38 మధ్య వయసున్న మహిళలపై ప్రయోగించి చూడగా అది విజయవంతం కావడంతో ఇటీవలే దీన్ని ఐఐటీ – ఢిల్లీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రోల్ఆన్ బయట మందుల షాపులోనే కాకుండా అమెజాన్ వంటి ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో ఉంది.

కొన్ని గృహ చికిత్సలు

  • అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి తగినంత నిమ్మరసం, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పిరియడ్స్ లో రోజుకు రెండు మూడు సార్లు త్రాగటం వలన నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • హాట్ బ్యాగ్ తో ఉపశమనాన్ని పొందవచ్చు దీన్ని పొత్తికడుపు, నడుము దగ్గర కాపడం పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • నెలసరి సమయంలో శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అందుకే నడుము, కడుపు భాగంలో 15 నిమిషాల పాటు సువాసనగల నూనెలతో మర్దన చేస్తే ఫలితం బాగుంటుంది.
  • ఈ సమయంలో జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం తినకపోవడమే మంచిది.
  • పీచు పదార్ధాలు, విటమిన్లు, ఐరన్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
  • క్యాల్షియం లోపం వలన కూడా నెలసరి నొప్పులు రావచ్చు. అందుకని క్యాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. బాదంపప్పు, పెరుగు, సాల్మన్ చేప లాంటి ఆహార పదార్థాలతో పాటు సూర్యరశ్మి శరీరంపై పడేలా చేసుకోవడం వలన నెలసరి నొప్పులు దూరం చేసుకోవచ్చు.