కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీటీడీ సిబ్బందిలో 80 మంది కరోనా బారినపడినట్టు కలెక్టర్ ఎన్.గుప్తా తెలిపారు. టీటీడీలో ప్రతి రోజు 200 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలి పారు. అయితే భక్తుల నుండి ఎవ్వరికీ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.
అయినా సరే.. ఆలయం మాత్రం తెరిచే ఉంటుందని ప్రకటించారు. మరోవైపు లాక్‌డౌన్ సడలించిన తర్వాత శ్రీవారి ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల గడిచింది కరోనా మహమ్మారి నేపథ్యంలో కొండపై మరింత ప్రబలకుండా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేశారు.
ఆ తర్వాత నిబంధనలు సడలించిన నేపథ్యంలో తిరిగి దర్శనానికి అనుమతినిచ్చారు. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తులకు మాత్రమే అనుమతినిచ్చిన బోర్డు.. ప్రస్తుతం 12,000 మంది భక్తులకు అనుమతినిచ్చింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,555 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,814కు చేరింది. అట్లాగే కొత్తగా 13 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 277కు చేరుకొంది.
ప్రధానంగా ఈ నాలుగు జిల్లాలో 200కు పైగా కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. అవి: చిత్తూరు (236), గుంటూరు (228), విశాఖ (208), శ్రీకాకుళం (206).