దక్షిణాసియాలో అధికంగా తెల్లబియ్యం (పచ్చి బియ్యం) వాడడం వల్లే దీర్ఘకాలిక(టైప్-2) మధుమేహం వస్తోందని డయాబెటిస్ కేర్ అనే అమెరికన్ జర్నల్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీస్ సెంటర్ వ్యవస్థాపకుడు డాక్టర్ మోహన్ తెలిపారు.
అమెరికన్ జర్నల్ తరఫున డాక్టర్ మోహన్ ప్రత్యేక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ పరిశోధన ప్రకారం రోజుకు 450 గ్రాముల కంటే అధికంగా తెల్లబియ్యంతో వండిన ఆహారాన్ని తినడం వల్ల మధుమేహం వస్తున్నట్లు రుజువైందన్నారు. ఈ కారణంగా 20 మందిలో ఒకరు టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. పచ్చిబియ్యం వాడకాన్ని తగ్గించి రాగులు, సజ్జలు, గోధుమతో తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటే మధుమేహాన్ని ముందుగానే నివారించవచ్చునని ఆయన తెలిపారు. రోజూ ఆహారంలో పప్పుధాన్యాలు, చిక్కుడు కాయలు, ఆకుకూరలు అధికంగా చేర్చుకుంటే మధుమేహాన్ని నివారించవచ్చునని తమ పరిశీలనలో తేలిందని డాక్టర్ మోహన్ తెలిపారు.